భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో దృఢమైనదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లి పట్టణం, కోర్టు సముదాయం నందు నూతనంగా నిర్మితమైన అడిషనల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)కోర్టు భవనం ప్రారంభిస్తూ దేశచరిత్రలో మదనపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనను ప్రసిద్ధిగాంచిన బి.టి.కళాశాల నందు బెంగాలీ నుండి ఆంగ్లంలోకి తర్జుమా చేశారని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం 470 ఆర్టికల్స్,106 రాజ్యాంగ సవరణ చట్టాలు కలిగి ఉందని చెబుతూ ఇవి న్యాయవ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నాయని పేర్కొంటూ ముఖ్యంగా ఆర్టికల్ 14 దేశ పౌరుల సమానత్వాన్ని తెలియజేస్తుందని తెలిపారు.
న్యాయవ్యవస్థపై దేశ ప్రజలకు మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇది జరగాలంటే కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. పిటిషన్ల కోసం కోర్టుకు వచ్చే వారికి అన్ని విధాల సహకరించి సేవలు అందించాలని ఆయన చెప్పారు.
గతంలో సౌకర్యాలు లేని సమయంలో న్యాయవాదులు గురువులను ఆదర్శంగా తీసుకుని కోర్టులో వాదనలు వినిపించేవారని, న్యాయాధికారులు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇచ్చేవారని భట్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కొందరు న్యాయవాదులు గూగుల్‌ను అనుసరిస్తున్నారే కానీ కోర్టులో ఉన్న గురువులను గుర్తించడం లేదని విచారం వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని దీన్ని అందిపుచ్చుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచించారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారికి తోడ్పాటు అందించాలని తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కుటుంబం సభ్యుల సహకారముందని అని తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి నిర్వర్తించడం అలాగే న్యాయమూర్తి తీర్పును వెలువరించడం అంత సులభతరం కాదని తెలిపారు. మదనపల్లి నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా వెంకటనారాయణ బట్టి ఎదగడం ఎంతో ఆనందించాల్సిన అంశం అని చెప్పారు. ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను చాలావరకూ తగ్గించామని చెబుతూ అలాగే జిల్లా కోర్టుల్లో కూడా కేసు తగ్గించడానికి కృషి చేయాలని కోరారు.
More Stories
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం