సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలపై కేసు

సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలపై కేసు
రాష్ట్రపతి ప్రసంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలపై ముజఫర్‌పూర్‌ సిజెఎం (చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌) కోర్టులో ఫిర్యాదు నమోదైంది. 
 
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ వెలుపల ఆమె ప్రసంగం బాగోలేదని చెప్పడం సరికాదని, కాంగ్రెస్‌ నేతలు ద్రౌపది ముర్ముని అవమానించేందుకు ప్రయత్నించారని సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లహ్లాద్‌పూర్‌ పటాహి నివాసి ముజఫ్ఫాపూర్‌కి చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఝా కోర్టులో ఫిర్యాదు చేశారు. 
 
భారత న్యాయ సంహిత 2023లోని 352, 351(2) (3) 79, 151 61(2) కింద వీరిపై కేసు నమోదైంది. ఆరోపణలు రుజువైతే నిందితులకు రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు పడే అవకాశం ఉందని సుధీర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక వాద్రాలపై నేను ముజఫర్‌పూర్‌ కోర్టులో క్రిమినల్‌ కేసు పెట్టానని తెలిపారు. 
 
“పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్‌పై ప్రసంగించారు. ఆమె ప్రసంగాన్ని కుట్రపూరితంగానే వీరు అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఓ గిరిజన మహిళ. అలాంటి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అందుకే ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేశాను’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ఫిబ్రవరి 10వ తేదీన కోర్టు విచారించనుంది.
 
కాగా, జనవరి 31వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మొదటగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియాగాంధీ ‘రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉంది. చివరి వరకు ఆమె మాట్లాడలేక అలసిపోయింది’ అని చెప్పారు. 
 
ఆ తర్వాత రాహుల్‌ గాంధీ తల్లి మాటలకు మద్దతిస రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉంది. చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పారు అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కేసు నమోదైంది.