
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలుసుకొని చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. బీఆర్‌ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది.
ఈ కేసులో శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన న్యాయవాదిని ధర్మాసనం నిలదీసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు అంది పది నెలలు గడుస్తున్నా వారికి నోటీసులు జారీచేసేందుకు ఇంకా తీరిక దొరకలేదా? అని ప్రశ్నించింది. సముచిత సమయం కావాలని న్యాయవాది కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సముచిత సమయం అంటే శాసనసభా సమయం ముగియాలా? అసెంబ్లీ గడువు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోరా?’ అని నిప్పులు చెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసు మాదిరిగా చేస్తారా? అని నిలదీసింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ, తాను స్పీకర్ తరఫున వాదించడం లేదని, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదిస్తున్నానని వివరించడంపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల మీద మూడు నెలల్లోగా విచారణ చేపట్టాలని, అందుకు షెడ్యూల్‌ను ఖరారు చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి..’ అని గత నవంబర్ 22న తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కే వివేకానంద్ జనవరి 16న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంక్రటావు, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తొలుత రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు.
మిగిలిన ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీపై వేరుగా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు