కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకై సన్నాహాలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకై సన్నాహాలు
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకై 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ శ్రీనివాస శివరాం కోరడంతో కర్నూలు జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా కొన్ని ప్రతిపాదనలు పంపారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస, వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని ఈ నెల 30లోపే పంపాలని కోరారు.
 
ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాషా రహదారులు, భవనాలశాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, ఆర్డీవోలను ఆదేశించారు.  హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ/ప్రైవేటు భవనాలు ఉన్నాయా ?లేవా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవోకు స్పష్టం చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కూటమి హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక బెంచ్‌ ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్‌ అథారిటీ (హైకోర్టు న్యాయమూర్తులు-ఫుల్‌ కోర్ట్‌) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ అప్పటి కార్యదర్శి గతేడాది అక్టోబరు 28న హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కు లేఖ వ్రాసారు.

కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుపై హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో ఓ కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఏర్పాటు చేశారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లకు కమిటీలో స్థానం కల్పించారు.  కర్నూలు నగర శివారులోని దిన్నెదేవరపాడులో అత్యాధునికంగా గతఏడాది రూ 25 కోట్లతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నూతన భవనాన్ని ఈ సందర్భంగా గుర్తించారు.

ఇందులో న్యాయస్థాన అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథిగృహం, అందులోని నాలుగు సూట్‌ రూములను వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలు లేవు.
దీంతోపాటు బి.తాండ్రపాడులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో, సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రాంగణంలోని క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఖాళీగా ఉన్న 50 గదులను అధికారులు పరిశీలించారు. మునగాలపాడులో బాలసాయిబాబా ట్రస్టు పరిధిలో ఓ సువిశాల పాఠశాల భవనం అందుబాటులో ఉంది. వీటన్నింటికి సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం.