రసాభాసగా జిహెచ్ఎంసి సమావేశం.. చర్చ లేకుండానే బడ్జెట్

రసాభాసగా జిహెచ్ఎంసి సమావేశం.. చర్చ లేకుండానే బడ్జెట్
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ చెప్పగా అందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. 

ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వ లోపాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. డివిజన్ల వారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,480 కోట్ల బడ్జెట్‌ను మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదించారు. దీంతో మేయర్ తీరుపై సభ్యులు విస్మయానికి గురయ్యారు. కనీస చర్చ లేకుండానే ఎలా ఆమోదిస్తారంటూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా  ఇరుపార్టీల కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ కార్పొరేటర్‌లు ప్రదర్శించిన ఫ్లకార్డులను కాంగ్రెస్‌ సభ్యులు చించివేశారు. రౌడీముకల్లా సభలో వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శించారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొడవతో మేయర్‌ విజయ లక్ష్మి కౌన్సిల్‌ హాల్‌లోకి మార్షల్స్‌ను పిలిచారు.

అయితే సభ్యలో గందరగోళం నెలకొనడంతో ఐదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకుని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.