మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా

మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా

* హిందువులకు కొత్త ప్రవర్తనా నియమావళి!

ఈ నెల 27వ తేదీన మహాకుంభమేళ సెక్టార్‌ 17లో జరగనున్న ‘ధర్మ సభ’లో ‘సనాతన బోర్డు’ రాజ్యాంగ ముసాయిదాను ప్రకటిస్తామని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త దేవికానంద్‌ ఠాకూర్‌ వెల్లడించారు.  గురువారం నిరంజని అఖాడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మన ధర్మానికి (మతం) స్వేచ్ఛ లేదు. మన ఆలయాలను ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. మన గురుకులాలను మూసివేస్తున్నారు. గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి.. ఈ క్రమంలో మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సనాతన బోర్డు అవసరం’ అని పేర్కొన్నారు.
 
ధర్మసభకు అన్ని అఖాడాల ప్రతినిధులు, నలుగురు శంకరాచార్యుల ప్రతినిధులు, తదితరులు హాజరవుతారని చెప్పారు. సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అది జరగకుండా కుంభమేళాను వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.  జునా అఖాడాకు చెందిన మహంత్‌ స్వామి యతీంద్రానంద్‌ గిరి మాట్లాడుతూ. సనాతన బోర్డు భారతదేశానికే కాదు.. మొత్తం మానవాళికి అవసరమని స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, ద్వేషం, అరాచకాలను నిర్మూలించవచ్చని తెలిపారు. 
 
నిరంజని అఖాడా సీనియర్‌ మహామండలేశ్వర్‌, ఉజ్జయిని అర్జి హనుమాన్‌ ఆలయ మహంత్‌ స్వామి ప్రేమానంద్‌ పూరీ మాట్లాడుతూ గంగానది భూమి వక్ఫ్‌ బోర్డుకు చెందిందని కొంత మంది వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడు పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
దేశ సమగ్రతను కాపాడేందుకు సనాతన బోర్డు ఏర్పాటు చాలా ముఖ్యమని చెప్పారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు సనాతన బోర్డు ఏర్పాటు అవసరమని ఆనంద్‌ అఖాడాకు చెందిన స్వామి బాలంకానంద గిరి మహారాజ్‌, పీఠాధీశ్వర్‌ స్పష్టం చేశారు.
 
కాగా, హిందువులు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ఒక ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతున్నది. మహా కుంభమేళా జరుగుతున్న క్రమంలో కాశీ విద్వత్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ కొత్త హిందూ ప్రవర్తనా నియమావళిని సనాతన ధర్మాన్ని పాటించే వారు చేయాల్సినవి, చేయకూడనివి పొందురిచారు.

300 పేజీలున్న ఈ నియమావళిలోని అంశాలను విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరిగే సమావేశంలో రుషులు, స్వాములు, మతపెద్దలతో చర్చిస్తారు. సాధువులు సహా శంకరాచార్యులు ధ్రువీకరించిన తర్వాత వేలాదిగా ముద్రించిన ప్రతులను మహాకుంభమేళాలో భక్తులకు పంపిణీ చేస్తారు. గత 15 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సాధువులు, వైదిక పండితులతో సమాలోచనలు జరిపిన అనంతరం తయారు చేశారు.

అందులోని అంశాలను ఇంకా ప్రకటించినప్పటికీ  సనాతన ధర్మ అనుచరులు తమ సామాజిక, ఆధ్యాత్మిక జీవితాలలో ఏ విధంగా వ్యవహరించాలో వివరిస్తుందని అఖిల భారత సంత్ సమితి ప్రధాన కార్యదర్శి జితేంద్రనంద సరస్వతి తెలిపారు.

కొత్త హిందూ ప్రవర్తనా నియమావళి రాత్రిపూట జరిగే వివాహాల కన్నా సూర్యుని సమక్షంలో పగటిపూట పెండ్లిండ్లు చేసుకోవాలని సూచిస్తుందని, అలాగే ఆడ శిశు హత్యలను, మహిళల నుంచి కట్నం స్వీకరించడాన్ని వ్యతిరేకిస్తుందని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని, వారు యజ్ఞ, యాగాదులు వంటివి చేయడానికి అర్హులేనని, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తుందని, అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతుందని ఆయన చెప్పారు.

కాగా, పది రోజులుగా కొనసాగుతున్న మహా కుంభమేళాలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గురువారం మధ్యాహ్నానికి 10 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కుంభమేళ జరుగుతున్న ప్రాంతం నుంచి దాదాపు 300 అక్రమ వంట గ్యాస్‌ సిలిండర్లను అగ్నిమాపక శాఖ గురువారం స్వాధీనం చేసుకుంది.