దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు

దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ నుంచి పెట్టుబడులకు సంబంధించి నిర్దిష్టంగా ఎవ్వరితో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండానే తిరిగి వచ్చింది. ఒక వంక పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1.79 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రూ 15 లక్షల కోట్లకు సంబంధించి ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చారు. కాని, చంద్రబాబు మాత్రం దాదాపు ఖాళీగా తిరిగి వచ్చారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పరిశ్రమల అనుకూల విధానాల గురించి విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ప్రభుత్వ విధానాలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. ముఖాముఖి భేటీలు, సదస్సులు, చర్చలు నిర్వహించారు. మెర్ ఎస్కే నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ ప్రపంచ స్థాయి సంస్థలు, సీఈవోలతో చర్చలు జరిపారు. 

 
పెట్టుబడులను రాబట్టలేకపోయినా నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్లో విజయం సాధించినట్లు చంద్రబాబు బృందం సంతృప్తి వ్యక్తం చేస్తున్నది. మొదటిసారిగా పెట్టుబడుల కోసం తండ్రితో కలిసి దావోస్ వెళ్లిన మంత్రి నారా లోకేష్ కు ఒక విధంగా ఇది నిరుత్సాహకారమైన పర్యటనగా పలువురు భావిస్తున్నారు. పైగా, గురువారం ఆయన పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. 
 
అయితే, పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీలో పర్యటించి పెట్టుబడుల గురించి పరిశీలించేందుకు సానుకూలత వ్యక్తం చేసారని చెప్పుకోవడం ద్వారా తమ పర్యటన ఫలవంతమైన్నట్లు ముఖ్యమంత్రి బృందం చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. దావోస్ అనేది ఒప్పందాలు చేసుకునే వేదిక కాదని, ఇది ఒక కనెక్టింగ్ సెంటర్ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు. కానీ చంద్రబాబు గతంలో ఇదే దావోస్ వేదికగా ఎన్నో ఒప్పందాలు చేసుకోవడం, ప్రచారం చేసుకోవటం మనకు తెలిసిందే.

 

దావోస్ కు వెళ్లిన కేంద్ర, రాష్త్ర మంత్రులలో తానే సీనియర్ నాయకుడిని అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పడం గమనార్హం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహితం అనేకసార్లు వెళ్లి వచ్చారు. అయితే ఈ పర్యాయం తగిన సన్నాహాలు చేయకుండా వెళ్ళారా? అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో నూతనంగా పెట్టుబడులను ఆకట్టుకునేందుకు సానుకూల వాతావరణం లేకపోవడమే అందుకు కారణం అనే అభిప్రాయం కలుగుతుంది. 

 
తెలంగాణ, మహారాష్ట్రలలో మాదిరిగా స్పష్టమైన సానుకూల వాతావరణాన్ని చూపడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందా? అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు రాష్టాల ఆర్హ్దిక పరిస్థితులు, పెట్టుబడులకు అవసరమైన అవకాశాలు, ల్యాండ్ బ్యాంకు వివరాలు వంటివి వెబ్ సైట్ లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
కానీ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదిరిగా బ్రోచర్లు తాయారు చేసుకొని, ఆంగ్ల మీడియా ల ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారం చేసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వం పాత పద్ధతులనే ఆవలంభిస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. దావోస్ యాత్ర కోసం ఏపీ ప్రభుత్వం రూ 75 కోట్ల మేరకు ఖర్చు పెట్టిన్నట్లు తెలుస్తోంది.
 
అక్కడికి వచ్చేది అంతా వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే దిగ్గజ సంస్థల ప్రతినిధులు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో, .ఏ ప్రజానిధితో ఎలా వ్యవహరిస్తే పని అవుతుందో కార్పొరేట్ వర్గాల్లో ముందే సమాచారం ఉంటుంది. బ్రోచర్లు చూసి ఎవరో అడిగారు అని ఏ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టదు.  కేవలం నాయకులు ప్రచారం కోసం మాత్రమే ఇటువంటి ఆర్భాటాలకు దిగుతూ ఉంటారు.
 
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం 2022లో దావోస్ వెళ్లి రూ. 1.20 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించారు. కానీ ఒక ఒప్పందం కూడా కార్యరూపం దాల్చలేదు. పైగా 2023లో అసలు దావోస్ వైపు వెళ్లకుండా ముఖం చాటేశారు. సంపద పెంచడమే తన లక్ష్యం అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ దిశలో ఇంకా పాలనను మళ్లించేలేక పోతున్నారా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.