వీర జవాన్ కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు

వీర జవాన్ కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు

ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన జవాను కార్తీక్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు మధ్య బుధవారం మధ్యాహ్నం జరిగాయి. భారతమాత కోసం జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పులలో గాయపడి వీర మరణం పొందిన అమర జవాన్‌ కార్తీక్‌ యాదవ్‌ కు తల్లిదండ్రులు, ఎగువ రాగిమాని పెంట గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. 

28 ఏళ్ల బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి (సెల్వి) శోకం తీరనిది. కానీ దేశం కోసం బిడ్డ ప్రాణాలర్పించాడని ఆ తల్లిదండ్రులు సెల్వి, వరద రాజులు గర్వపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ బుధవారం స్వగ్రామమైన బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటలో మధ్యాహ్నం 3 గంటల 45 నిముషాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

డెత్‌ సర్మనీ పరేడ్‌ లో 4/8 గురా రైఫిల్‌ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ శివరాజ్‌ సింగ్‌ గిల్‌ నేతృత్వం లో 35 మందితో పెరేడ్‌ నిర్వహించి గౌరవ వందనం చేశారు. 23 మంది పెరేడ్‌ చేసి గాలిోక కాల్పులు చేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.

 ఈ అంతిమ సంస్కారానికి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పూతల పట్టు, చిత్తూరు శాసనసభ్యులు కె.మురళి మోహన్‌, గురజాల జగన్మోహన్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, చుడా చైర్‌ పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్డిఓ భవాని బంగారు పాళ్యం తాసిల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, మాజీ సైనికుల సంక్షేమ సంఘం, ఎం ఈ జీ సంఘం, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు.

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన పంగల కార్తీక్‌ యాదవ్‌ (28) స్వగ్రామం బంగారు పాళ్యం మండలం ఎగువ రాగిమాను పెంట. వీరి తల్లిదండ్రులు సెల్వి , వరదరాజులు, అన్న రాజేష్‌. పదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన కార్తీక్‌ యాదవ్‌ రాజస్థాన్‌ ఆర్మ్‌ డ్‌ రెజిమెంట్‌ లో ఏడేళ్ల పాటు పనిచేశాక రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే కూంబింగ్‌ రైఫిల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. 

ఆదివారం జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో కార్తీక్‌ తీవ్రంగా గాయపడి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. వీర జవాన్‌ మరణ వార్త పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి మండి పల్లి రాంప్రసాద్‌ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద రావు, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీర జవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.