సింగపూర్‌ అధ్యక్షుడితో ఒడిశా 8 ఒప్పందాలు

సింగపూర్‌ అధ్యక్షుడితో ఒడిశా 8 ఒప్పందాలు
సింగపూర్‌తో అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రత్యేకంగా సింగపూర్‌ పర్యటనకు వెళ్లి రెండు ఎంవోయూలు కుదుర్చుకోగా, ఏకంగా సింగపూర్‌ అధ్యక్షుడే ఒడిశా వచ్చి 8 ఒప్పందాలపై సంతకాలు చేయడం ఆసక్తికరంగా మారింది. 
 
ఈ నెలాఖరులో భువనేశ్వర్‌లో నిర్వహించనున్న ఒడిశా ఇన్వెస్టర్‌ సమ్మిట్‌కు ముందు ఈ ఒప్పందాలు జరగగా, ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌తోపాటు సింగపూర్‌ అధ్యక్షుడు థర్మన్‌ షణ్ముగరత్నం పాల్గొనడం విశేషం. రేవంత్ రెడ్డి సింగపూర్‌లో కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే, ఒడిశా రాష్ట్రం మాత్రం అక్కడి దేశాధ్యక్షుడి సమక్షంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. 
 
నెటిజన్లు ఈ అంశంపై రెండు రాష్ర్టాలను పోల్చుకుంటూ ప కామెం్లు పెడుతున్నారు. సీఎం రేవంత్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం రెండురోజులపాటు సింగపూర్‌లో పర్యటించి ప్రపంచ వాణిజ్య వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో రాష్ట్ర బృందం సుమారు రూ.3,950 కోట్ల విలువైన రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నది. 
 
అదే సమయంలో సింగపూర్‌ అధ్యక్షుడు షణ్ముగరత్నం ఒడిశాలో పర్యటించగా, ఆయన సమక్షంలో ఒడిశా- సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య ఎనిమిది ఎంవోయూలు జరిగాయి. రాష్ట్ర ప్రతినిధి బృందం సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు సుమారు రూ.12.5 కోట్లు ఖర్చవుతున్నట్టు అంచనా. కాగా, ఒడిశా ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండానే సింగపూర్‌ బృందాన్నే తమ రాష్ర్టానికి ఆహ్వానించి అనేక విలువైన ఒప్పందాలు చేసుకున్నదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఒడిశా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐడిసిఓ), సింగపూర్‌లోని సెంబ్‌కార్ప్ మధ్య పారిశ్రామిక పార్కులు, గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ కోసం రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పెట్రోకెమికల్, పెట్రోలియం ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) కోసం ఐడిసిఓ, సింగపూర్‌లోని సుర్బానా జురాంగ్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది. కొత్త నగర అభివృద్ధి కోసం భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ), సింగపూర్‌లోని సుర్బానా జురాంగ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
 
కొత్త ఇంధన రంగానికి నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్ టి యు), జీఆర్ఐడిసిఓ, ఐఐటి భువనేశ్వర్ మధ్య సహకారం ఇతర వాటిలో ఉన్నాయి. ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం కోసం ఒడిశాలోని ఎలక్ట్రానిక్స్ & ఐటీ విభాగం, సింగపూర్‌లోని గ్లోబల్ ఫైనాన్స్ & టెక్నాలజీ నెట్‌వర్క్ (జిఎఫ్ టీఎన్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అధునాతన నైపుణ్యాలపై దృష్టి సారించే నైపుణ్య అభివృద్ధి & సాంకేతిక విద్యా విభాగం, సింగపూర్‌లోని ఐటిఇ, ఎడ్కేషన్ సర్వీసెస్ (ఐటిఇఇఎస్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 
 
సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం భువనేశ్వర్‌లోని వరల్డ్ స్కిల్ సెంటర్‌ను సందర్శించారు. ఇది సింగపూర్, ఒడిశా రాష్ట్రం మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సింగపూర్ అధ్యక్షుడిని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వాగతించారు. “సింగపూర్, ఒడిశా మధ్య సహకారానికి అపారమైన సామర్థ్యం ఉంది” అని పేర్కొంటూ, గాఢమైన సంబంధాల పట్ల ముఖ్యమంత్రి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.