కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడే దోషి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడే దోషి
 
* సిబిఐ దర్యాప్తు పట్ల జూనియర్ వైద్యుల అసంతృప్తి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కేసులో  సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. పోలీస్‌ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి ‘నీకు శిక్ష పడాలి’ అని న్యాయమూర్తి చెప్పారు. శిక్షలను సోమవారం ఖరారు చేస్తామని తెలిపారు.

గతేడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రిలో అర్ధరాత్రి జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన కొన్ని నెలల పాటు యావత్ దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనతో కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్లు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా జూడాలు తీవ్ర ఆందోు, నిరనలు చేపట్టారు. 

ఈ ఘటనకు కారణమైన దోషులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్లు చేస్తూ దీక్షలు, నిరసనలు చేశారు. ఆసుపత్రులలో వైద్యులకు భద్రత కల్పించాలని ఆందోళనలు జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసును మొదట కోల్‌కతా పోలీసులు విచారణ జరపగా, ఆ తర్వాత కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. 

ఇందులో భాగంగానే సంజయ్ రాయ్‌ని ప్రధాన నిందితుడిగా పేర్కొనగా ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ సహా పలువురిని నిందితులుగా చేర్చారు.  ఈ కేసులో ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జిషీట్ సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఈ కేసులో 120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోర్టులో వాదించింది. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్షలు ఖారారు చేస్తామని కోర్టు వెల్లడించింది.

అయితే జూనియర్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఛార్జిషీటులో సీబీఐ ఎక్కడా ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ రాయ్‌ని ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు, ఈ కేసులో మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు. 

ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇంఛార్జ్ అభిజిత్‌ మండల్ కూడా అరెస్ట్ అయ్యారు. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా, తర్వాత వారికి ప్రత్యేక కోర్టులో బెయిల్ వచ్చింది. వారు అరెస్ట్ అయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్‌ చేయడంలో విఫలం కావడంతో వారికి బెయిల్ లభించింది.

దానితో కోర్టు రాయ్‌ను దోషిగా తేల్చినప్పటికీ, జూనియర్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ  దర్యాప్తులో పరిష్కారం కాని ప్రశ్నలకు సమాధానాలు డిమాండ్ చేస్తున్నారు.  “ఈ నేరంలో కరి కంట ఎక్కువ మంది పాల్గొన్నారని మేము మొదటి రోజు నుండే చెబుతున్నాము” అని తమ సహోద్యోగికి న్యాయం కోసం జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి ముఖంగా మారిన ఆర్జి కార్‌కు చెందిన జూనియర్ డాక్టర్ డాక్టర్ అనికేత్ మహతో స్పష్టం చేశారు. 

“కేసులో ఈ దర్యాప్తు కోణం ఏమైంది? సరే, నేరంలో సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడని మేము అంగీకరిస్తున్నాము. కానీ అది అతని ఒక్కడి పని కాదు. రెండవది, సాక్ష్యాలను తారుమారు చేశారని సిబిఐ తన ప్రాథమిక ఛార్జిషీట్‌లో పేర్కొంది. దానికి ఏమి జరిగింది?” అని ప్రశ్నించారు.

 “ఈ సాక్ష్యాలను తారుమారు చేయడంపై ఎలాంటి చర్య తీసుకుంటారో, మాకు ఇంకా తెలియదు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ కేసు నుండి పూర్తిగా విముక్తి పొందారా? అనుబంధ ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయడం లేదు? దానిని ఎప్పుడు దాఖలు చేస్తారు? సంజయ్ రాయ్ కాకుండా ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు?” అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.