
‘‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గం అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని ధ్వజమెత్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం’’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హమీలకు, నేడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు పొంతనే లేదని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
కానీ నేడు అందుకు భిన్నంగా రూ.12 వేలు మాత్రమే ఇస్తానని ప్రకటించడమంటే రైతులను దగా చేయడమే అని ధ్వజమెత్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఏడాదిపాటు రైతు భరోసా చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, గత ఏడాది చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లిస్తారని ఆశించిన రైతులకు పూర్తి నిరాశే ఎదురైందని ఆయన తెలిపారు. ‘
నేడు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అదనంగా నయాపైసా కూడా సాయం చేయలేదని తేటతెల్లమైందని సంజయ్ కుమార్ తెలిపారు. ఎందుకంటే ఎగ్గొట్టిన ఏడాది రైతు భరోసా బకాయి మొత్తాన్ని విభజించి ఏటా రెండేసి వేల రూపాయల చొప్పున రాబోయే నాలుగేళ్లకు జోడించి చెల్లించాలనుకుంటున్నారే తప్ప రైతులకు అదనంగా ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో ఎకరాకు మరో రూ.2 వేల రూపాయలు రైతులు నష్టపోయినట్లయిందని పేర్కొన్నారు.
కౌలు రైతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వ్యవసాయ కూలీలను పూర్తిగా విస్మరించడం అన్యాయం అని కేంద్ర మంత్రి విమర్శించారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తారు? అట్లాగే ఎంత మంది కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా సొమ్ము చెల్లిస్తారో ప్రకటించకపోవడం విడ్డూరం అని పేర్కొన్నారు. సీఎం ప్రకటనను చూస్తుంటే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రైతు బంధు లబ్దిదారుల సంఖ్యలో భారీగా కోత విధించాలనుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది