
* మణిపూర్ మిలిటెంట్లకు స్టార్‌లింక్ ఇంటర్నెట్!
మణిపూర్‌లో భద్రతా పరిస్థితులను గవర్నర్ అజరు కుమార్ భల్లా శనివారం సమీక్షించారు. ఆయన గవర్నర్‌గా ప్రమాణం చేసి 24గంటలు కూడా గడవక ముందే కుకీల ఆధిపత్యం వుండే కంగ్‌పోక్సి జిల్లాలో పోలీసులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జిల్లా ఎస్‌పి ప్రభాకర్ సహా పలువురు గాయపడ్డారు.
వ్యూహాత్మక కుకీ గ్రామం నుండి కేంద్ర బలగాలను తరలించాలని డిమాండ్ చేయడానికి నిరసనగా స్థానికులు తలపెట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 2023 మే 3 నుండి కుకీ జో, మెయితి వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ బలగాల సీనియర్ అధికారులతో రాజ్‌భవన్‌లో సమావేశమైన భల్లా శాంతి భద్రతల పరిస్థితులను, చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మణిపూర్, మయన్మార్ సరిహద్దుపై, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఇంఫాల్ లోయను అనుసంధానించే హైవేలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రజల భద్రత, రక్షణలకు ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ డిజిపిని ఆదేశించారు. ఈ విషయంలో పాలనా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా సైన్యాన్ని, పారా మిలటరీ బలగాలను కోరారు. అంతకుముందు కుకీజో ఏరియాల్లో బంద్ జరిగింది.
కాగా, గిరిజనుల ఐక్యతా కమిటీ (సిఒటియు) శుక్రవారం మరో 24గంటల పాటు బంద్‌ను పొడిగించింది. గిరిజనుల హక్కులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని విమర్శిస్తూ నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలను అన్యాయంగా, గిరిజన ప్రాంతాల్లో కొనసాగించడం వల్ల తమ హక్కులు దెబ్బ తింటున్నాయని కమిటీ విమర్శించింది.
మరోవంక, మణిపూర్‌లో హింసకు పాల్పడుతున్న మిలిటెంట్లు అక్రమంగా ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తెలుస్తున్నది. ‘ది గార్డియన్’ పత్రిక వార్తా కథనం ప్రకారం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్నది. భారత్‌లో స్టార్‌లింక్‌కు అనుమతి లేదు.
అయితే, మయన్మార్‌లో మాత్రం అనుమతి ఉన్నట్టు గార్డియన్ పేర్కొన్నది. మణిపూర్‌కు సరిహద్దునే మయన్మార్ ఉండటంతో మిలిటెంట్లు స్టార్‌లింక్ ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో ఏడాదిన్నరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్