కాంగ్రెస్ కుంభకోణాలు త్వరలో బైట పెడతా!

కాంగ్రెస్ కుంభకోణాలు త్వరలో బైట పెడతా!
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, వాటిని త్వరలో బయట పెడతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో మంత్రులు ఎవరెవరు ఇన్వాల్ అయ్యారో ఆధారాలతో సహా చెబుతామని వెల్లడించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. 
 
రేవంత్ రెడ్డీ సినిమా డైలాగ్‌లకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధుపై తన విధి విధానాలు ఏందో చెప్పిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
 
రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫల అయిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని ఆరోపించారు. గడిచిన ఏడాది అంత కాంగ్రెస్ మోసాల సంవత్సరమని విమర్శించారు. కొత్త ఏడాదిలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి బుద్ది అలవరచుకోవాలని హితవు పలికారు.
 
ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ రైతు రుణమాఫీ అని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క లేనిపోని గొప్పలు చెబుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు కూలీలకు కేటాయించిన నిధులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. 15లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ మంత్రి లెక్కలు చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 
 
రూ. 9వేల కోట్లను డిసెంబర్ 28వ తేదీలోగా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. 
 
ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు. రబీ అయిపొయింది.. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.