ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశిని `తాత్కాలిక ముఖ్యమంత్రిగా ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం తనను బాధించిందని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఒక ముఖ్యమంత్రిగా అతిషికే కాకుండా, రాష్ట్రపతి ప్రతినిధిగా తనకు కూడా అవమానకరమని ఆయన స్పష్టం చేశారు.
తన ప్రభుత్వంలోని పూర్తిస్థాయి ముఖ్యమంత్రిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా చెప్పడం అభ్యంతరకరమని చెబుతూ ముఖ్యమంత్రి అతిషికి లెఫ్టినెంట్ గవర్నర్ సోమవారంనాడు ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖను “మురికి రాజకీయం” అంటూ ముఖ్యమంత్రి అతిషి కొట్టిపారేసారు.
“కేజ్రీవాల్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఢిల్లీ సంక్షేమం కోసం పనిచేశారు. ఆయన చూపిన మార్గంలోనే నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నాను. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను మళ్లీ మళ్లీ గెలిపించాలని ఎన్నుకున్నారు” అని ఆమె పేర్కొన్నారు. “ఒక మహిళగా, మహిళా సమ్మాన్ యోజనలో మీరు అడ్డుకోవడం నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది” అంటూ ఆమె లెఫ్టనెంట్ గవర్నర్ ను నిందించారు.
లిక్కర్ పాలసీ కేసులో బెయిలుపై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా గత సెప్టెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు. సీఎం సీటును ఖాళీగానే ఉంచుతున్నట్టు అతిషి ప్రకటించారు. కేజ్రీవాల్ సైతం ఎన్నికల తర్వాత తిరిగి సీఎం పగ్గాలు చేపడతానని పలుమార్లు ప్రకటించారు. కాగా, ఇటీవల మీడియా సమక్షంలో అతిషిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పేర్కొనడాన్ని సీఎంకు రాసిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తావించారు.
”ఇటీవల మిమ్మల్ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మీడియా ముందు చెప్పారు. ఇది అభ్యంతరకరం. బాధాకరం కూడా. తాత్కాలిక ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగపరమైన వెసులుబాటు ఏదీ లేదు” అని ఆ లేఖలో సక్సేనా తెలిపారు. పైగా, ఇది ప్రజాస్వా్మ్య స్ఫూర్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలను తగ్గించి చూపడమే అవుతుందని అతిషికి రాసిన లేఖలో ఎల్జీ పేర్కొన్నారు.
యమునా నదీ జలాల ప్రక్షాళన వంటి అంశాలతో సహా పలు అంశాల విషయంలో తన వైఫల్యాన్ని మీ నేత (కేజ్రీవాల్) బహిరంగంగానే ఒప్పుకున్నారని, ఆయన వైఫల్యం చెందిన అంశాలను మీరు (అతిషి) పరిశీలించవచ్చని అంటూ హితవు కూడా చెప్పారు.
కేజ్రీవాల్ మీ సమక్షంలోనే ముఖ్యమంత్రి పేరుతో సీనియర్ సిటిజన్లు, మహిళలకు సంబంధించిన అనధికార ప్రకటనలు చేయడం సీఎం పదవిని, మంత్రి మండలిని కించపరచడమే అవుతుందని అని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అమలులో లేని పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వంలోని రెండు శాఖలు ఇటీవల పబ్లిక్ నోటీసులు ఇవ్వడాన్ని కూడా ఎల్జీ ప్రస్తావించారు.
ఇది సీఎంగా మీకు కూడా ఇబ్బందికరమైన పరిణామమేనని గుర్తుచేశారు. వాస్తవాలను వెల్లడించడం ద్వారా తమ విధులను డిపార్ట్‌మెంట్ అధికారులు సక్రమంగా నిర్వర్తించారని ఎల్జీ అభినందించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అందుకు భిన్నంగా సీఎంపై రవాణాశాఖ, ఇతర విచారణ సంస్థలు విచారణ చేపట్టవచ్చని, సీఎంను జైలుకు పంపవచ్చని కేజ్రీవాల్ ప్రకటించారని పేర్కొన్నారు.
అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని రవాణా శాఖ చీఫ్ సెక్రటరీనే స్వయంగా మీకు (సీఎం) తెలియజేయడం, విజిలెన్స్ శాఖ సైతం ఇదే తరహా వివరణ ఇవ్వడం తెలిసిందేనని సక్సేనా గుర్తు చేశా రు. అతిషి సమర్ధవంతంగా పలు శాఖలను నిర్వహిస్తున్నారని కూడా ఆ లేఖలో ఎల్జీ ప్రశంసించారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!