మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయం

మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయం
మాజీ మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలం కేటాయించాలని నిర్ణయించిందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. అయితే, మాజీ ప్రధాని అంత్యక్రియలపై కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. 
 
దేశంలోని తొలి సిక్కు ప్రధానమంత్రి సింగ్‌ను కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించిన తర్వాత బిజెపి అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. నిగమ్ బోధ్ ఘాట్‌లో కాకుండా ఆయనకు స్మారక చిహ్నం ఏర్పాటు చేసే ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. 
 
భారతమాత గొప్ప కుమారుడు, సిక్కు సమాజం నుండి వచ్చిన తొలి ప్రధానమంత్రి అయిన సింగ్‌ను నిగమ్ బోధ్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయనను పూర్తిగా అవమానించిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దీనిపై నడ్డా తీవ్రంగా స్పందిస్తూ “మాజీ ప్రధాని విషాదకరమైన మరణం తర్వాత కూడా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,  ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయాలు చేయడం మానుకోకపోవడం చాలా దురదృష్టకరం” అని విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయించిందని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. “అయినప్పటికీ, కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది” అని ఆయన మండిపడ్డారు.
 
“రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం మానుకోవాలి” అని నడ్డా హితవు చెప్పారు. సోనియా గాంధీని “సూపర్ ప్రైమ్ మినిస్టర్”గా ఉంచడం ద్వారా కాంగ్రెస్ ప్రధానమంత్రి పదవిని దిగజార్చిందని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రధానమంత్రి పదవిని “కళంకీకరించింది, దిగజార్చింది” అని బిజెపి అధ్యక్షుడు ఆరోపించారు.
 
“ఇది మాత్రమే కాదు. రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌ను చింపి మన్మోహన్ సింగ్‌ను అవమానించిన విధంగా, దీనికి వేరే ఉదాహరణ లేదు” అని ఆయన పేర్కొన్నారు. “అదే కాంగ్రెస్ నేడు మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయాలు చేస్తోంది” అని నడ్డా ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం తనను తప్ప మరెవరికీ గౌరవం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 
 
గాంధీ కుటుంబం సింగ్ లేదా మరే ఇతర నాయకుడికి న్యాయం చేయలేదని నడ్డా విమరసంచారు. వారు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలకు చెందినవారు కావచ్చు, బిఆర్ అంబేద్కర్, భారతదేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు,  అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సీతారాం కేసరి ఉదాహరణలను నడ్డా ఈ సందర్భంగా ఉటంకించారు.
 
“గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ ఇతర పెద్ద నాయకులందరినీ (కుటుంబంలోని వారు కాకుండా) అవమానించింది” అని బిజెపి అధ్యక్షుడుతెలిపారు. పివి నరసింహ రావు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలనే అభ్యర్థనను సోనియా గాంధీ తిరస్కరించారని ఆయన ఆరోపించారు.
 
“ఆయన (రావు) భౌతికకాయానికి కాంగ్రెస్ కార్యాలయంలో కూడా స్థానం ఇవ్వలేదు. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగాలని కాంగ్రెస్ కోరుకోలేదు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరిగాయి. 2015లో రావు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు భారతరత్నతో సత్కరించింది మోదీ” అని నడ్డా గుర్తు చేశారు.
 
 “వాజ్‌పేయిజీ మరణించిన తర్వాత కూడా, కాంగ్రెస్ నాయకులు, వారి మద్దతుదారులు ఆయనను అవమానించడం కొనసాగించారు” అని ఆయన ఆరోపించారు. 2020లో భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా ఇష్టపడలేదు” అని తెలిపారు. 
 
“2013లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఏ నాయకుడికీ ప్రత్యేక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయబోమని చెప్పింది. ప్రధానమంత్రిని స్మరించుకోవడానికి, దేశ ప్రజలకు వారితో పరిచయం కల్పించడానికి ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీని నిర్మించింది ప్రధానమంత్రి మోదీ” అని ఆయన వివరించారు.
 
“కాంగ్రెస్ తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్మారక చిహ్నాలను నిర్మించింది” అని బిజెపి అధ్యక్షుడు దుయ్యబట్టారు. గౌరవం ఇవ్వడంకు నిజమైన అర్థాన్ని మోదీ నుండి నేర్చుకోవాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితవు చెప్పారు. 
 
ఒక అంచనా ప్రకారం, దేశంలోని సుమారు 600 ప్రభుత్వ పథకాలు, విద్యాసంస్థలు, అవార్డులు, రోడ్లు, జాతీయ ఉద్యానవనాలు, మ్యూజియంలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, భవనాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాయని నడ్డా పేర్కొన్నారు. “ఇతర వ్యక్తుల పేరుతో ఉన్న పథకాల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు” అని ఆయన చెప్పారు. “మన దేశం సూత్రప్రాయంగా లేని కాంగ్రెస్ చేసిన పాపాలను మరచిపోదు లేదా క్షమించదు” అని కూడా ఆయన హెచ్చరించారు.