విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు

విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు
 
నేడు విజయ్‌ దివస్‌. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ నడ్డివిరిచి పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది.  1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్‌ 16న ‘విజయ్‌ దివస్‌’ ను నిర్వహిస్తుంది. 
 
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ నేతలు ఎక్స్‌ వేదికగా ట్వీట్లు చేశారు.“నేడు విజయ్‌ దివస్‌. 1971 యుద్ధంలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, భారతదేశానికి విజయాన్ని అందించిన మన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నాను. ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కథలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తాయి” అని రాష్ట్రపతి ముర్ము గుర్తుచేసుకున్నారు.

“1971లో భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన వీర సైనికుల ధైర్యాన్ని, వారి త్యాగాలను మేము ఎప్పటికీ గౌరవిస్తాము. వారి నిస్వార్థ అంకితభావం, అచంచలమైన సంకల్పం మన దేశాన్ని రక్షించాయి. మనకు కీర్తిని తెచ్చాయి. వారి త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“ఈ రోజు విజయ్ దివస్. సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది. జవాన్ల త్యాగం, సేవను దేశం ఎన్నటికీ మర్చిపోదు” అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు.