మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లికి ఎంపీలు కేశినేని, బాల‌శౌరి

మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లికి ఎంపీలు కేశినేని, బాల‌శౌరి
లోక్‌స‌భ కోటా నుంచి మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఎంపీలు కేశినేని శివ‌నాథ్, బాల‌శౌరి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ఎకగీవ్రంగా జ‌రిగింది. అధికారికంగా లోక్‌స‌భ స‌చివాల‌యం ప్రకటించింది. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

లోక్‌సభ నుంచి పాలకమండలిలో ప్రాతినిధ్యం వహించడానికి ఉన్న రెండు స్థానాలకు వీరిద్దరితో పాటు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి నామినేషన్లు వేశారు. అయితే శుక్రవారం ఈ ముగ్గురూ ఉపసహరించుకోవడంతో కేశినేని శివనాథ్, బాలశౌరిల ఎన్నికల ఏకగ్రీవం అయింది. 

లోక్‌సభ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దీనికంటే ముందు నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్, అనకాపల్లి వైసీపీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ఉన్నారు. ఇప్పుడు 17వ లోక్ సభ పదవీకాలం ముగిసి 18వ లోక్‌సభ ఏర్పడిన నేపథ్యంలో ఆ రెండు స్థానాకు మళ్లీ ఎన్నిక నిర్వహించారు.

పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో… గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది. బాగా ప్రచారం జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తున్నారు. ఆస్పత్రి నిత్యం కిటకిటలాడుతోంది. 

మంగళగిరి ఎయిమ్స్‌లో 2019లోవైద్యసేవలు ప్రారంభించారు. అప్పుడు 300-400 మంది రోగులు వచ్చేవారు. ఇప్పుడు రోజుకు 3 వేల మంది వరకు ఓపీకి వస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలతో ఎయిమ్స్ సతమతం అయింది.