ఇండియా కూటమిలో బీటలు… నాయకత్వం కోరుకుంటున్న మమత!

ఇండియా కూటమిలో బీటలు… నాయకత్వం కోరుకుంటున్న మమత!
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
 
 ‘ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేని నాయకుడిని మనం ఇంకా ఎంతకాలం భరించాలి’ అన్న ధోరణి ఆ పార్టీల్లో ఇటీవల అధికమైంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూటమి నాయకత్వం, సమన్వయం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఇండియా కూటమిని ఏర్పాటు చేశాను. నాకు అవకాశమిస్తే దానిని సాఫీగా నడిసిస్తా. అయితే నేను బెంగాల్‌ను వదిలి బయటకు రావాలనుకోవడం లేదు. ఇక్కడ నుంచే కూటమిని నడపగలను’ అని ఆమె చెప్పారు.

ముఖ్యంగా శివసేన (యూబీటీ), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు శనివారం మమత చేసిన ప్రకటనపై స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి, కూటమిలో నాయకత్వ మార్పు చేపట్టాలన్న సంకేతాలు ఇచ్చాయి. దానికి తోడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూటమి పరాజయం, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఒకే అంశం(అదానీ అవినీతి)పై కాంగ్రెస్‌ కేంద్రాన్ని నిలదీయడం, అధికార పార్టీ సభను వాయిదా వేయడం తదితర అంశాలు కూటమిలోని మిగతా పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉందని అంటూ పరోక్షంగా రాహుల్ పై విసుర్లు విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది టీఎంసీ వల్లే సాధ్యం అని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు దీదీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. 
 
మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్ననట్లు సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ ప్రతినిధి ఉదయ్‌వీర్‌ సింగ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీని ఇస్తోందని.. కమలం పార్టీని నిలువరించడంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.

ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. ఇండియా కూటమికి బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సరైన లీడర్ అవుతారని ఆ పార్టీ పేర్కొంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు చోటు కల్పించలేదని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా ఆరోపించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల మాట విని ఉంటే ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని మండిపడ్డారు. మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 
మమతా బెనర్జీ చెప్పినట్లు ఆమె పార్టీ నడుస్తుందని.. అదే విధంగా తాము కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలనే పాటిస్తామంటూ హస్తం పార్టీ వెల్లడించింది. ఇక ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్‌ రౌత్ తెలిపారు. 
ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ గానీ, శివసేన పార్టీ నేత గానీ ఎవరు ఉన్నా తామంతా కలిసే ఉంటామని చెప్పారు. అంతేకాకుండా ఇదే విషయంపై మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు త్వరలోనే కోల్‌కతా వెళ్తామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

‘మమతా జీ అభిప్రాయం మాకు తెలుసు. ఆమె భారత కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలనే మేమూ కోరుకుంటున్నాం. దీదీ అయినా, అరవింద్‌ కేజ్రీవాల్‌ అయినా, శివసేన అయినా.. మేమంతా కలిసే ఉన్నాం. ఈ విషయంపై మమతా బెనర్జీతో మాట్లాడేందుకు మేము త్వరలో కోల్‌కతా వెళ్తాం’ అని సంజయ్ రౌత్ విలేకరుల సమావేశంలో అన్నారు.

బంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టకుండా చేయటంలో మమత బెనర్జీ విజయవంతం అయ్యారని ఆ పార్టీకి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు.  ఇండియా కూటమిలో మొదలైన అంతర్గత పోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటంతోపాటు రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ను ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతోంది. 
 
మోదీని ఓడించటం తప్ప మరే ఉమ్మడి అజెండా లేని గ్రూపుగా ఇండియా కూటమిని అభివర్ణించింది. ఏకాభిప్రాయం లేని వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని వాగ్బాణాలు సంధించింది. అధికారదాహం, అవినీతి వంశాలను కాపాడటమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తోంది.