సరిహద్దుల్లో టర్కీ డ్రోన్లతో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలు

సరిహద్దుల్లో టర్కీ డ్రోన్లతో బంగ్లాదేశ్  కవ్వింపు చర్యలు

* 9న బంగ్లాదేశ్ కు భారత విదేశాంగ కార్యదర్శి

భారత్‌, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో  అత్యాధునిక బేరక్తర్‌ టీబీ2 డ్రోన్లను మొహరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్‌ సరిహద్దులో నిఘా పెంచింది. షేఖ్ హసీనా ప్రభుత్వ పతనం దరిమిలా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 
 
భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ ‘బైరాక్టర్ టిబి2’ మానవరహిత వైమానిక వాహనాలు (యుఎవిలు) మోహరించినట్లు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్‌లోని 67వ ఆర్మీ వాటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వాటిని మోహరించినప్పటికీ, అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అప్రమత్తం అయింది.
 
ఈ ప్రాంతం భారతదేశంలో చాలా సున్నితమైనదిగా పరిగణించబడుతుంది. టర్కియే టిబి-2 డ్రోన్ చాలా శక్తివంతమైనది. ఇది దాడి చేయడమే కాకుండా, గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉగ్రవాద గ్రూపులపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆమె భారత్‌కు పారిపోయిన తరువాత సరిహద్దు సమీప ప్రాంతాల్లోని తీవ్రవాదులు మళ్లీ పుంజుకున్నారు.
 
అయితే షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత సరిహద్దు వెంట ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయనే ఇంటెలిజెన్స్‌ నివేదికల నేపథ్యంలో ఆ డ్రోన్లను మొహరించినట్లు బంగ్లాదేశ్‌ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, మన సరిహద్దుల భద్రత, రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నామని సీనియర్‌ రక్షణ అధికారి ఒకరు చెప్పారు.
 
ఆ దేశంలోని ప్రస్తుత అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నట్లు సమాచారం. హసీనా బహిష్కరణ తరువాత సరిహద్దు ప్రాంతంలో భారత వ్యతిరేక అంశాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అధునాతన యుఎవిల మోహరింపుతో నిఘా అవసరమని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.
 
సరిహద్దుల్లో తాజా డ్రోన్ విస్తరణలను భారత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను కూడా తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతదేశం గూఢచార భాగస్వామ్య యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తోంది. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలపై తాము అప్రమత్తం అయ్యామని భారత అధికారులు చెబుతున్నారు.

మరోవంక, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న బంగ్లాదేశ్ పర్యటించనున్నారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్  వెల్లడించారు. విక్రమ్ మిశ్రీ  తన ర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శితో పాటు అనేక మంది ఇతరులతో కూడా ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారని జైస్వాల్ తెలిపారు.

బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై దాష్టికాలు పెరిగిపోయాయి. హిందూ ఆధ్యాత్మిక ప్రముఖుడు చిన్మయ్ కృష్ణ దాస్ ను కూడా అరెస్టు చేసి బందీగా ఉంచారు. ఇదిలావుండగా కోల్ కతాలో యాక్టింగ్ డిప్యూటీ హై కమిషనర్ గా ఉన్న షిక్దర్ ముహమ్మద్ అష్రఫుర్ రహ్మాన్ ను బంగ్లాదేశ్ వెనక్కి పిలిపించుకుంది. రహ్మాన్ బంగ్లాదేశ్ రాజకీయ వ్యవహారాల మంత్రి కూడా. ఆయన ఢాకాకు తిరిగి వెళ్లిపోయారు.