
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియమించేందుకు సిద్ధమైంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తుంటారు.
తిరుమలతోపాటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ఆలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా అందిస్తారు. రోజుకు సుమారు 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే 70 వేల ఉచిత లడ్డూలు భక్తులకు అందిస్తారు. భక్తులు తమ బంధువులు, స్నేహితుల కోసం అదనంగా లడ్డులు కొనుగోలు చేస్తారు.
దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కొనుగోలు చేయాలనుకునే భక్తులకు ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను రూ. 50లకు విక్రయిస్తారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో తిరుమల లడ్డూలకు అధిక డిమాండ్ ఉంటుంది. లడ్డూలకు భక్తుల నుంచి ఉన్న డిమాండ్ ఆధారంగా అదనంగా లడ్డూలు తయారీ చేయాలని టీటీడీ ప్రత్యేక చర్యలు చెప్పట్టింది.
డిమాండ్ ఆధారంగా 50 వేల చిన్న లడ్డూలు తయారీకి టీటీడీ సిద్ధం అవుతుంది. దీంతో పాటు 4,000 పెద్ద లడ్డూలు, 3500 వడలు తయారు చేయాలని టీటీడీ యోచిస్తుంది. వీటని దృష్టిలో ఉంచుకుని పోటు సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించాలని టీటీడీ నిర్ణయించింది.
కాగా, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటింది. వరుసగా 33వ నెల రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు టీటీడీ ప్రకటించింది. నవంబర్ నెలలో స్వామివారి హుండీ ఆదాయం రూ.111 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది 11 నెలల్లో హుండీ ద్వారా రూ.1,253 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం