ఈ నెల 4న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం

ఈ నెల 4న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది బుధవారం తేలిపోనుంది. ఈ నెల 4న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్ ప్రకటించారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడే సీఎంగా మహాయుతి కూటమి సర్కారును నడపనున్నారు.  

బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, బీజేపీ నుంచి ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం ఉండదని పరోక్షంగా ఫడ్నవీస్‌నే అధికారికంగా సీఎంగా ప్రకటిస్తారనే సంకేతాలిచ్చారు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయం బీజేపీదేనని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించడంతో బీజేపీ నాయకుడే సీఎం కాబోతున్నారనే విషయం స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 4న బీజేఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది. వారి సమక్షంలో వచ్చే గురువారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. 

ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్‌ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. దక్షిణ ముంబైలోని అజాద్‌ మైదాన్‌లో కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితర బీజేపీ అగ్ర నాయకులంతా హాజరుకానున్నట్టు సమాచారం.

ఇలా ఉండగా, మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు అన్నది ఇంకా తేలలేదు. సీఎం పదవితోపాటు పోర్ట్‌ఫోలియో కేటాయింపులను ఖరారు చేయడానికి మహాయుతి నేతల సమావేశం సోమవారం జరుగాల్సి ఉంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఏక్‌నాథ్‌ షిండే ముంబైలోని తన అధికారిక నివాసమైన వర్షాకు తిరిగి రాలేదు. 

ప్రస్తుతం ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులను ఖరారు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మరోవైపు మహాయుతి నేతల మధ్య సోమవారం ఎలాంటి షెడ్యూల్ లేదని శివసేన వర్గాలు తెలిపాయి. కూటమిలోని ఏకైక పెద్ద పార్టీ అయిన బీజేపీ నిర్వహించే ఈ సమావేశం కోసం తమ పార్టీ ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. మహాయుతి నేతల సమావేశం మంగళవారం జరుగుతుందని వెల్లడించింది.

 కాగా ఉపముఖ్యమంత్రి రేస్ లో తాను లేనని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు. దీని గురించి వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. అధికారంపై తనకు ఎలాంటి కోరిక లేదని, తాను ఏ మంత్రి పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. సోమవారం ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం గురించి ప్రస్తావించారు. దీనిపై చాలా పుకార్లు ఉన్నాయని అంగీకరించారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్య కారణాలతో రెండు రోజులు గ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి పుకార్లు విజృంభించాయి. ఉప ముఖ్యమంత్రిని నేనే అనే వార్తలు గత రెండు రోజులుగా వ్యాపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. డిప్యూటీ సీఎం పదవికి సంబంధించిన వార్తలన్నీ నిరాధారమైనవి’ అని ఆయన వెల్లడించారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం తనకు వచ్చిందని శ్రీకాంత్ షిండే తెలిపారు. అయితే పార్టీ కోసం పని చేయాలని భావించి మంత్రి పదవిని నిరాకరించినట్లు చెప్పారు. అధికారంలో ఉండాలనే కోరిక తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో మంత్రి పదవి రేసులో నేను లేనని మరోసారి స్పష్టం చేస్తున్నా. నా లోక్‌సభ నియోజకవర్గం, శివసేన కోసం మాత్రమే నేను పని చేస్తా’ అని తెలిపారు.