బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే 100 శాతం సుంకం

బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే 100 శాతం సుంకం
అధ్యక్ష పీఠం అధిరోహించక ముందే ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ తాజాగా, భారత్ సహా బ్రిక్స్‌ దేశాలకు హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీని రూపొందిస వాటిపై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సదస్సుల్లో ఉమ్మడి కరెన్సీపై దృష్టిపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పిలుపునిచ్చారు.
 
‘‘బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్‌కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న అంశాన్ని మేము గమనిస్తున్నాం. అవి ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదు. శక్తిమంతమైన అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురాకూడదు. అలా చేస్తే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తాం. దీంతో పాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌ సోషల్‌‌ వేదికగా హెచ్చిరించారు. 
 
బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహ 10 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  అక్టోబరు 23-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌ వేదికగా జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులోనే బ్రిక్స్‌ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పిలుపునిచ్చారు.
 
 ‘బ్రిక్స్‌ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి ఇంకా సమయం ఆసన్నం కాలేదు. ఆ దిశలో నెమ్మదిగా అడుగులు వేస్తాం. లేదంటే ఐరోపా సమాఖ్య ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవి ఎదురవుతాయి. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్‌ కరెన్సీ వినియోగించుకోడానికి భారత్‌తో కలిసి రష్యా పనిచేస్తోంది’ అని తెలిపారు. 
 
“సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాం. సెంట్రల్‌ బ్యాంకులతో ఆయాదేశాలకు సంబంధాలు ఏర్పడాలి. డాలరు వాడకం సరైనదేనా అనే ఆలోచనలో యావత్‌ ప్రపంచం ఉంది. అందుకే చెల్లింపులు, నిల్వల్లో దాని పరిమాణం తగ్గుతోంది. అమెరికా మిత్రదేశాలూ డాలర్‌ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయి” అని పుతిన్‌ పేర్కొన్నారు. 
 
ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలో టారిఫ్ వార్ మొదలవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డాలర్ వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత ఆర్థిక విధానంలో లేదా దేశ రాజకీయ లేదా వ్యూహాత్మక విధానాల్లో డీ-డాలరైజేషన్ భాగం కాదు. కానీ వ్యాపార భాగస్వాములు డాలర్లను తీసుకోని సందర్భాల్లో లేదా వాణిజ్య విధానాల కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారు’ అని చెప్పారు.