ప్రధాని మోదీ హత్యకు ప్లాన్‌ అంటూ బెదిరింపు కాల్‌

ప్రధాని మోదీ హత్యకు ప్లాన్‌ అంటూ బెదిరింపు కాల్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు పాల్పడింది. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు పేర్కొంది. గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. 
 
ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఫోన్‌ చేసిన వ్యక్తి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.

ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్ లో ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే దానిపై మాట్లాడారు. ప్రధాని మోదీని హతమార్చేందుకు ప్లాన్ సిద్ధంగా ఉందని, ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐర్ నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీకి హత్య బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో హర్యానాకు చెందిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయింది. అందులో మోదీని కాల్చివేస్తానని బెదిరించాడు. వీడియోలో యువకుడు తనను తాను హర్యానాకు చెందిన వ్యక్తతిగా పేర్కొన్నాడు. సోనిపట్‌లోని మోహనా గ్రామ నివాసిగా తెలిపాడు. ప్రధాని మోదీ నా ముందుకు వస్తే కాల్చిపారేస్తానని ఆ వీడియోలో చెప్పాడు.

అదేవిధంగా 2022లో కూడా ప్రధాని మోదీకికి వ్యతిరేకంగా జేవియర్ అనే వ్యక్తి నుంచి కూడా ఇలాంటి బెదిరింపులు జరిగాయి. జేవియర్ కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌కు పంపిన లేఖలో మోదీని చంపేస్తానని రాశాడు. మోదీ పరిస్థితి రాజీవ్ గాంధీలా ఉంటుందని అన్నాడు.