జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణం

జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణం
జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా  జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరేన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
 
రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి హేమంత్‌ సోరెన్‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు షిబు సోరెన్‌, రూపి సోరెన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌, ఎంపీ రాఘవ్‌ చద్ధా తదితరులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్‌ సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రజల ఐక్యత అతిపెద్ద ఆయుధమని, ఎవ్వరూ విడదీయలేరని, అణచివేయలేరని జెఎంఎం అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారంకు ముందు  పేర్కొన్నారు. విప్లవాన్ని ఎంతగా అణచివేస్తే.. అంతకన్నా వేగంగా ఉవ్వెత్తున ఎగసిపడుతుందని పరోక్షంగా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. ”మనల్ని నిశ్శబ్దం చేయాలని చూసినప్పుడల్లా.. మన తిరుగుబాటు, విప్లవాల స్వరం పెరుగుతుంది. ఎందుకంటే జార్ఖండీలు ఎవరికీ తలవంచరు. చివరి వరకు పొరాటం కొనసాగిస్తారు ” అని తెలిపారు. ”ఈ రోజు చారిత్రాత్మకం. ఇది మనందరి సమిష్టి పోరాటం ఫలితమని ఎక్స్‌లో పేర్కొన్నారు.