
హైదరాబాద్ మహానగరానికి గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి. కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అంటే నగరంలో అవి అంతర్భాగమయ్యాయి. అలాగే మహానగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇక నగరంలో ప్రధాన రహదారులు మాత్రమే కాదు చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.
దీంతో వాయి కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదు హైదరాబాద్ మహానగరంలో వివిధ రకాల కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఈ కాలుష్యాన్ని నియింత్రించే విషయంలో.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ట్రాఫిక్ పోలీసులు నగర రహదారులపై విధులు నిర్వహించే వారు. కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదు. వారు సైతం చలానాలు రాసే పనిలో నిమగ్నమై పోయారు. దీంతో ట్రాఫిక్ నియంత్రించే విధులను వారు పూర్తిగా విస్మరించారని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. దీంతో వాయు, శబ్ద కాలుష్యం మహానగరంలో పెచ్చురిల్లుతోందని చెబుతున్నారు.
మరోవైపు గతంలో నగరంలో భారీ వృక్షాలు రహదారులకిరువైపులా ఉండేవి. నేడు నగరంలో ఆ పరిస్థితి అయితే లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇంకోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో సాక్షాత్తూ సుప్రీంకోర్టు సైతం స్వయంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అలాంటి వేళ హైదరాబాద్ మహానగరంలో సైతం న్యూఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు నెలకొంటే భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంటుందని నగర జీవుల్లో ఓ విధమైన భయాందోళన వ్యక్తమవుతుంది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు