యుద్ధ నేరాలపై నెతన్యాహుకు అరెస్ట్‌ వారంట్‌

యుద్ధ నేరాలపై నెతన్యాహుకు అరెస్ట్‌ వారంట్‌
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, హమాస్ నాయకుడు మహ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్ మస్రీలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి నెదర్లాండ్స్‌లోని హాగ్‌లో ఉన్న ఐసీసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. 
 
హత్య, హింస, అమానవీయ చర్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు వారు పాల్పడినట్లు ఆరోపించింది. గాజాపై దాడులతోపాటు పౌరులకు ఆహారం, నీరు, వైద్య సహాయం వంటివి అందకుండా చేశారని ఆరోపించింది. పిల్లలతో సహా మరణాలు, తీవ్రమైన మానవ సంక్షోభానికి ఇది దారితీసినట్లు పేర్కొంది.

గత ఏడాది అక్టోబర్ 8 నుంచి ఈ ఏడాది మే 20 వరకు జరిగిన యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను పరిశీలించినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తెలిపింది. నిందితులు ఉద్దేశపూర్వకంగా పౌరులను, పరిమిత వైద్య సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది. దీనికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఐసీసీ కోర్టు పేర్కొంది. తమకు అపారమైన బాధను కలిగించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

‘గాజాలోని పౌరులపై ఉద్దేశపూర్వకంగా దాడులకు నేతృత్వం వహించిన నెతన్యాహు, గాలంట్‌ ఈ యుద్ద నేరాలకు బాధ్యత వహిస్తారు. దీనిని విశ్వసించడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని ఛాంబర్ అంచనా వేసింది’ అని పేర్కొంది. కోర్టు అధికార పరిధిని ఇజ్రాయెల్ ఆమోదించాల్సిన అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.

మరోవైపు గత ఏడాది అక్టోబర్‌ 7న గాజాపై పట్టున్న హమాస్‌ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసింది. వందలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులను చంపడంతోపాటు పలువురిని బంధించి గాజాకు తరలించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ గాజాపై దాడులు చేసింది. మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది మరణించారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రులు, స్కూళ్లు వంటివి నేలమట్టమయ్యాయి.