మహారాష్ట్రలో పోలింగ్‌ బూత్‌ ధ్వంసం.. పలు చోట్ల నిలిచిన ఓటింగ్‌

మహారాష్ట్రలో పోలింగ్‌ బూత్‌ ధ్వంసం.. పలు చోట్ల నిలిచిన ఓటింగ్‌
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ ధ్వంసమైంది. పోలింగ్ బూత్‌లోని ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయి. దీంతో అక్కడ కొంతసేపు ఓటింగ్‌ నిలిచిపోయింది. ఘట్నందూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే పోలింగ్‌ బూత్‌ ధ్వంసానికి కారణం ఏమిటన్నది తెలియలేదు.

కాగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్సీ)కి చెందిన స్థానిక నేత మాధవ్ జాదవ్‌పై పర్లీ టౌన్‌లోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఘట్నందూరు గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే అధికారంలో ఉన్న మహాయుతి కూటమి కార్యకర్తల దూకుడు కారణంగా ఈ పోలింగ్‌ బూత్‌ వద్ద గొడవ జరిగిందని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఆరోపించింది.

ఈ నేపథ్యంలో కార్యకర్తలు తోసుకోవడం వల్ల ఈవీఎం మిషన్లు, టేబుల్స్, ఇతర సామగ్రి నేలపై పడ్డాయని విమర్శించింది. మరోవైపు ఈ పోలింగ్‌ బూత్‌లో ధ్వంసమైన ఈవీఎంల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు బీడ్ కలెక్టర్ అవినాష్ పాఠక్ తెలిపారు. కొంతసేపటి తర్వాత ఓటింగ్‌ తిరిగి కొనసాగిందని చెప్పారు. పోలింగ్‌ బూత్‌ వద్ద పరిస్థితిని పోలీసులు అదుపు చేసినట్లు వెల్లడించారు. 

పోలింగ్‌ కేంద్రం ధ్వంసానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.కాగా, నందుర్‌బార్ నియోజకవర్గంలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్‌ తిరిగి కొనసాగింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవర్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గానికి చెందిన ఛగన్ భుజబల్‌ను శరద్‌ పవార్‌ వర్గం కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించకుండా ఆయనను నిలువరించారు. నాసిక్‌లోని యెవ్లా నియోజకవర్గం నుంచి ఛగన్ భుజబల్‌ పోటీ చేస్తున్నారు. బుధవారం పోలింగ్‌ సందర్భంగా ఆ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లను ఆయన సందర్శించారు. పోలింగ్‌ బూత్‌లోకి ఎక్కువసార్లు వెళ్లేందుకు ఆయనకు ఎలా అనుమతి ఇస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్‌ నియోజకవర్గంలో బీడ్‌కు చెందిన బాలాసాహెబ్ షిండే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. బుధవారం పోలింగ్‌ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఛత్రపతి షాహూ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రం వద్దకు వచ్చాడు. లైన్‌లో నిల్చొన్న అతడు ఉన్నట్టుండి నేలపై పడిపోయాడు.