బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. మానవత్వ పార్టీ

బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. మానవత్వ పార్టీ

బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ ఉపముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో హిందువులకు రక్షణ లేదని పేర్కొంటూ భారతదేశంలో మాత్రం ఇతర మతాల హీరోలను ప్రజలు అభిమానిస్తారని గుర్తు చేశారు. శనివారం మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. 

లాతూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్‌, నాందేడ్‌ జిల్లా భోకర్‌ నియోజకవర్గం అభ్యర్థి శ్రీజయ చవాన్‌ కోసం ఎన్నికల ప్రచారం చేశారు. లాతూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాందేడ్‌ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని కోరారు.

మహాయుతి కూటమి అభ్యర్దును గెలిపించాలని పిలుపునిచ్చారు. బాలాసాహెబ్ ఠాక దేశాన్ని రక్షించేందుకు ప్రతీ క్షణం తపించారని చెప్పుకొచ్చారు. శివసేన – జనసేన సనాతన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి హెచ్చరికలు చేస్తున్నారని, వారికి భయపడేది లేదని పరోక్షంగా పవన్ ఓవైసీని హెచ్చరించారు.
 
మహారాష్ట్ర సంస్కృతి, మరాఠి భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమి గెలపు అవసరమని చెప్పుకొచ్చారు. బాలా సాహెబ్ ఠాక్రే అయోధ్యలో రామాలయం గురించి పోరాటం చేసారని పేర్కొంటూ ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయం సాకారం చేసారని గుర్తు చేసారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందన్నారని తెలిపారు.
 
బీజేపీ హయాంలోనే మహారాష్ట్రకు భవిష్యత్ ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మంపై జరుగుతున్న అన్యాయాలు, దాడులకు వ్యతిరేకంగా పోరాడడంలో బాలాసాహెబ్ ఠాక్రే తనకు స్ఫూర్తి అని తెలిపారు.  మహారాష్ట్రలో సనాతన ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే చేసిన సేవలను కొనియాడారు. 
 
ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలని చెబుతూ ఆర్టికల్‌ 370 రద్దు, దేశ ప్రజల కల అయోధ్య రామమందిర నిర్మాణాన్ని నెరవేర్చారని తెలిపారు. 30 కోట్లమంది గ్రామీణ మహిళలకు జనధన్‌ యోజన బ్యాంకు ఖాతాలను తెరిపించి స్వయం ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 

12 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింపజేశారని తెలిపారు. పాలాజ్‌ సత్యగణేష్‌ ఆలయంలో పవన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాగా, బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో ‘‘మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైంది’’అని పవన్‌ చెప్పారు.

తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ.. బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అనే పాటను పాడారు. మహారాష్ట్ర నేల సంస్కృతి, సంప్రదాయాల కలబోతని, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ తన పోరాట పౌరుషం నింపిన గడ్డ అని పవన్‌ కొనియాడారు. 

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ లాంటి మహనీయులను దేశానికి అందించిన గడ్డ మహారాష్ట్ర అని, కర్మభూమి అయిన మహారాష్ట్ర దేశానికి ఓ స్ఫూర్తి మంత్రమని పేర్కొన్నారు. పోరాటంలో ముందుండే మరాఠా ప్రజలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పదవులు ముఖ్యం కాదని… జాతి, దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యుత్తమని నమ్మే బాల్‌థాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయని చెప్పారు. మనమంతా విడిపోయి బలహీనులుగా ఉందామా? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఏ ప్రాంతాల వారున్నా.. వారందరిలో సనాతన ధర్మమే నినాదంగా కనిపిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు.