
విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు తరలివస్తుండటంతో బాసర రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
వచ్చినవారిని వచ్చినట్లు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అమ్మవారి దర్శనానికొచ్చిన భక్తులను కూడా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. జర్నలిస్టుల సెల్‌ఫోన్లు తీసుకుని వీడియోలను డిలీట్ చేశారు. ఇక నిజామాబాద్‌లోనూ ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 11న ఆర్జీయూకేటీలో పీయూసీ సెకండియర్ చదువుతున్న స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకున్నది. సోమవారం ఉదయం తోటి విద్యార్థినులు టిఫిన్ చేయడానికి పిలువగా రానని చెప్పింది. అనంతరం అరగంట తర్వాత తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. కాగా, విద్యార్థిని గదిలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
అయితే తమ కుమార్తే బలవన్మరణానికి అధికారులు నిర్లక్ష్యమే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. స్వాతిప్రియ రూమ్‌లో ఉంటున్న స్నేహితురాలికి, మరో విద్యార్థికి గొడవ జరిగిందని, దీనిపై తమ కూతురు గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థి ఆమెను బెదిరించాడని తెలిపారు. ఈ విషయమై తాము అధికారులకు ఫిర్యాదు చేశామని, తర్వాత అతడిని సస్పెండ్ కూడా చేశారని చెప్పారు.
ఆ విద్యార్థి బెదిరిస్తున్నా అధికారులు పట్టించుకోనందువల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు. అయితే ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలంటూ విద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వారిపై భద్రతా సిబ్బంది దాడిచేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీనికి నిరసగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి