కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతి … సుప్రీం అసహనం

కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతి … సుప్రీం అసహనం
 
దేశంలోని పవిత్ర ఆలయాలు ఉన్న కేధారినాథ్, పూరి, రామేశ్వరం, ఇతర పుణ్యక్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయమంటారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలా చూస్తే నాలుగు పవిత్ర ఆలయాలు ఉన్న మహారాష్ట్రాను నాలుగు రాష్ట్రాలుగా చేయాల్సి వస్తుందని అంటూ అసహనం వ్యక్తం చేసింది.
 
హిందువులు పవిత్ర పుణ్య క్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి ని కేంద్ర పాలిత ప్రాంతం, టీటీడీకి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే ఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా కేఏ పాల్ స్వయంగా తన పిటిషన్ పై వాదనలు వినిపించారు. 
 
746 మంది కాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతి నగరాన్ని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయలేమని అడిగారు. ఇది ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని 14, 21, 25, 26 ఆర్టికల్స్ ను ఎత్తిచూపారు.

క్రైస్తవులు, ముస్లింలు తమ మత స్థలాలపై (చర్చిలు, మసీదులపై) స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నారని చెప్పారు. అదే హక్కు హిందువులకు నిరాకరించబడుతుందని కోర్టుకు నివేదించారు. ఇది చట్టం ముందు సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఆలయాలను రాజకీయంగా వాడుతున్నారని కోర్టుకు తెలిపారు. 

 
అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంపై అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పలు ఆదేశాలు చేసిప్పటికీ ఎలాంటి పురోగతి లేదని కోర్టుకు తెలిపారు. త్వరితగతిన విచారణ, జవాబుదారీతనం, సత్వర న్యాయం జరిగేలా కమిటీకి నిర్ణీత కాలవ్యవధితో  కూడిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తిరుపతికి నిత్యం వచ్చే లక్షలాది మంది భక్తుల సమస్యల పరిష్కారానికి, విచారణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. 
 
మత వర్గాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయ అవకతవకలు, జోక్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం తాము నేరుగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కేంద్రాన్ని ఆదేశించలేమని, ప్రత్యేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై పార్లమెంట్‌లో సవరణలు జరుగుతాయని స్పష్టం చేసింది.

అయితే తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై ద‌ర్యాప్తున‌కు సిట్ ఏర్పాటు చేస్తూ ఎటువంటి కాల‌ప‌రిమితిని నిర్ణ‌యించ‌కుండా నెల రోజుల క్రిత‌మే ఆమోదించింద‌ని పాల్ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. విచార‌ణ కూడా ప్రారంభం కానందున‌ కోర్టు క‌నీసం 90 రోజులు, లేదా 9 నెల‌ల కాల ప‌రిమితిని నిర్ణ‌యించాల‌ని కోరారు. అందుకు ధ‌ర్మాస‌నం స్పందించ‌కుండా కేసును ముగించింది.