భారత్ లో 82 లక్షల కొత్త టిబి కేసులు

భారత్ లో 82 లక్షల కొత్త టిబి కేసులు

దేశంలో క్షయవ్యాధి (టిబి) కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) స్పష్టం చేసింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్‌ఓ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2023లో సుమారుగా 82 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 1995 నుండి చూసినట్లైతే ఇంత అత్యధిక సంఖ్యలో నమోదవడం ఇదే. 2022లో 75లక్షల కేసులు నమోదయ్యాయి.

డబ్ల్యుహెచ్‌ఓ గ్లోబల్‌ ట్యూబర్‌ క్యులోసిస్‌ రిపోర్ట్‌-2024 ప్రకారం 2023లో ఇండియాలో 26శాతం టిబి కేసులు నమోద య్యాయి. ఆ తరువాత స్థానాల్లో ఇండోనేషియా (10 శాతం), చైనా (6.8 శాతం), ఫిలిప్పీన్స్‌ (6.8 శాతం), పాకిస్తాన్‌ (6.3 శాతం) ఉన్నాయి. కొత్త కేసుల్లో 55 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు, 12 శాతం మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని నివేదిక స్పష్టం చేసింది.

అంటు వ్యాధి సంబంధిత మరణాల్లో ప్రధాన కారణమైన క్షయ నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరమని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. టిబి కేసులు ఎక్కువగా నమోదైన 30 దేశాల్లోని జనాభాను ఈ వ్యాధి చాలా తీవ్రంగా ప్రభావితం చేసిందని నివేదిక పేర్కొంది.

ఆ దేశాల్లో అంగోలా, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, కంబోడియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చైనా, కాంగో, ఉత్తర కొరియా, డిఆర్‌ కాంగో, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, కెన్యా, లెసోతో, లైబీరియా, మొజాంబిక్‌, మయన్మార్‌, నమీబియా, నైజీరియా, పాకిస్థాన్‌, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్‌, రష్యా, సియెర్రా లియోన్‌, దక్షిణాఫ్రికా, థాయిలాండ్‌, టాంజానియా, వియత్నాం, జాంబియా, జింబాబ్వేలు వున్నాయి.

నిధుల లేమి వంటి నిరంతర సవాళ్లు క్షయ వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రపంచ ప్రయ త్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. టిబితో చనిపోయిన కేసులు 2022లో 10.32 లక్షలు వుండగా, 2023లో 10.25 లక్షలకు తగ్గాయి. టిబితో బాధపడుతున్న వారి సంఖ్య కోటీ 80లక్షలకు పెరిగింది. టిబి కేసుల పెరుగుదలపై డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గాబ్రి యేసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

”టిబి ఇప్పటికీ చాలా మందిని చంపుతోంది. అనారోగ్యానికి గురిచే స్తోంది. ఆ వ్యాధిని నిరోధించడానికి, గుర్తించడానికి, చికిత్సకు సాధనాలు వున్నప్పుడు కూడా ఇలా జరగడం ఆందోళనకరమని అన్నారు. టిబిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఈ దిశగా దేశాలు తమ బాధ్యతలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.