రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు నిరసన

రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు నిరసన
ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు నిరసనలకు దిగారు. నిన్నటి దాకా కుటుంబ సభ్యులు మాత్రమే రోడ్డెక్కగా శనివారం ప్రత్యక్షంగా పోలీసులే ఆందోళనలకు దిగారు. వరంగల్‌ మామునూరులో 4వ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు కమాండెంట్‌ ఆఫీసు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ వారి కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. సాగర్‌ రోడ్డుపై ఏక్‌ స్టేట్‌ ఏక్‌ పోలీస్‌ పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

కానిస్టేబుళ్ల సెలవులపై పాత పద్ధతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదని డీజీపీ జితేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కుటుంబసభ్యులపై శ్రీనివాసరావు అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నల్గొండ 12వ బెటాలియన్ వద్ద బందోబస్తుకి వెళ్లిన గ్రామీణ ఎస్సై సైదా బాబుకి నిరసన సెగ తగిలింది. 

ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబసభ్యులతో ఎస్సై సైదాబాబు దురుసుగా వ్యవహరించారని బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు.

కాగా శుక్రవారం ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ బెటాలియన్‌ భార్యలు ఆందోళనకు దిగారు. అనంతరం వారు సచివాలయ ముట్టడి ప్రయత్నించగా అరెస్టులకి దారితీసింది. ఏక్ పోలీస్‌ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

అది అమలయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని నినదించారు. ఒకే నోటిఫికేషన్‌, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి, కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు.