మూసీ సుందరీకరణపై రేవంత్ సవాల్ కు కిషన్ రెడ్డి సై

మూసీ సుందరీకరణపై రేవంత్ సవాల్ కు కిషన్ రెడ్డి సై

మూసీ సుందరీకరణకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి విసిరి న సవాల్‌కు తాము సి ద్ధంగా ఉన్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న వారు మూడు నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటే ఆ ప్రాజెక్టును విరమించుకుంటానని ముఖ్యమంత్రి సవాల్ చేశారని, అందుకు తాము సిద్దమేనని, అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించేందుకు సిద్దమేనా? అని సవాల్ విసిరారు. 

మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం జరిగిన బిజెపి మహా ధర్నాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన, ఆధునీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇళ్లను నిర్ధాక్షణ్యంగా కూల్చివేయడానికి తాము అంగీకరించమని తెలిపారు. పేదలకు బిజెపి ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోందని, నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికి రేవంత్ సర్కార్ ఇంతవరకు శంకుస్థాపన చేయలేదని, భూమి పూజ చేయలేదని విమర్శించారు. కొత్తగా ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లగా నివశిస్తున్న నిరుపేదల ఇండ్లను కూలుస్తోందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చి మసి పూసి మారేడుకాయ చేశారని ఆరోపించారు.

ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రజల ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారని తెలిపారు. కేసీఆర్ దారిలోనే ఇప్పుడు రేవంత్ వెళ్తున్నారని ఆరోపించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. మూసీ బాధితు కోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకు అయినా, చర్లపల్లి జైలుకు అయినా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

రేవంత్ రెడ్డి పోలీసులతో వస్తారా? ఎలా వస్తారో కానీ మూసీ బస్తీల్లోకి రావాలి, ఆయనను ప్రజలు ఏమీ అనకుండా తాము రక్షణగా ఉంటామని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. డ్రైయినేజీ విధానం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 

ఆరు గ్యారంటీల అమలును డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ డ్రామా ఆరు గ్యారెంటీల అమలును డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ అని ఆరోపించిన ఆయన ఆ పార్టీలో ఎవరికీ వారే సీఎంలంటూ సెటైర్ వేశారు. 

మూసీ సుందరీకరణపై ఆయనకే స్పష్టత లేదని అన్నారు. మొన్నటి వరకు హైడ్రా పేరుతో చేపట్టిన ఆపరేషన్ ఆ బాధితుల్లో జెసిబి, బుల్డోజర్లు అనే భయం కనిపించాయని, ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పావు కదా ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా? అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణను ఏటీఎంలాగా మార్చుకోవాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి చేపట్టిన ఆందోళనలతోనే హైడ్రా తోక ముడిచిందని మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోమని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలని, కానీ ఇలా బలవంతంగా మరో ప్రాంత ప్రజలను రోడ్డున పడేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇక నుంచి ఒక్క ఇళ్లు కూల్చిన ఊరుకోమని హెచ్చరించారు.