విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాల ర్యాలీపై లాఠీచార్జి

విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాల ర్యాలీపై లాఠీచార్జి
 
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ  సికింద్రాబాద్ లో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సికింద్రాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 
 
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ లో శనివారం స్థానికులు బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. హిందూ సంఘాలు, స్థానికులు మహంకాళి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 
 
దీంతో పోలీసులు అప్రమత్తమై, ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఇటీవల ఓ ఆగంతకుడు ధ్వంసం చేశాడు. ఆలయం గద్దెపైకి ఎక్కి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ ధ్వంసం చేశాడు. 
 

ఈ ఘటన గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విగ్రహ ధ్వంసం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముత్యాలమ్మ ఆలయంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు శనివారం నిరసన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ చేపట్టాయి. సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతల నెలకొనడంతో పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.

“సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ సోదరులపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్రం చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది” అంటూ బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ లాఠీ ఛార్జీకి ఎవరు ఆదేశించారు? అని ప్రశ్నించారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్పా న్యాయం కోరే భక్తులపై కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొంటూ మెజారిటీ ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. “మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాము” అని స్పష్టం చేశారు.