9 వేల‌ ప‌రుగుల క్ల‌బ్‌లో కోహ్లీ

9 వేల‌ ప‌రుగుల క్ల‌బ్‌లో కోహ్లీ

*  ఒక ఏడాదిలో ‘వంద సిక్సర్లు’ కొట్టిన తొలి జ‌ట్టుగా టీమిండియా

ప్ర‌పంచ క్రికెట్‌లో ర‌న్ మెషీన్‌గా, రికార్డుల రారాజుగా పేరొందిన‌ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగ‌మించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. బౌండ‌రీల‌తో చెల‌రేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు
 
విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశ‌గా సింగిల్ తీసిన కోహ్లీ 53 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఈ ఘ‌న‌త‌కు చేరువ‌య్యాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన నాలుగో భార‌త క్రికెట‌ర్‌గా క్రికెట‌ర్‌గా రికార్డు పుస్త‌కాల్లో చేరాడు. కోహ్లీ కంటే ముందు దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్(15,921), రాహుల్ ద్ర‌విడ్(13,265), సునీల్ గ‌వాస్క‌ర్(10,212)లు ఈ మైలురాయిని అధిగ‌మించారు.
 
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటి వరకు 116 మ్యాచ్ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ మాదిరే సుదీర్ఘ ఫార్మాట్లోనూ విరాట్ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 197 ఇన్నింగ్స్ల్లో విరాట్ 48.99 సగటున 9015* పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందులో ఏడుసార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
 
ఈ మ్యాచ్తో విరాట్ మరో రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి టీమ్ఇండియా తరఫున విరాట్ 536 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈక్రమంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీని దాటేశాడు. 15ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోనీ 535 మ్యాచ్లు ఆడాడు. కాగా, ఈ లిస్ట్లో విరాట్ కంటే ముందు దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఒక్కడే ఉన్నాడు. సచిన్ టీమ్ ఇండియా తరఫున 664 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

మరోవంక, సుదీర్ఘ ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన మ‌రునాడే టెస్టు క్రికెట్‌లో త‌మ‌కు తిరుగులేద‌ని చాటుతూ మ‌రో రికార్డు సొంతం చేసుకుంది. ఒక ఏడాదిలో ‘వంద సిక్సర్లు’  కొట్టిన తొలి జ‌ట్టుగా టీమిండియా రికార్డుపుట‌ల్లోకి ఎక్కింది. చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ ఈ ఘ‌న‌త‌కు చేరువైంది. 

అజాజ్ ప‌టేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో రోహిత్ సేన 100 సిక్స‌ర్ల‌తో రికార్డు నెల‌కొల్పింది.  టీమిండియా వంద సిక్స‌ర్ల రికార్డులో సింహ భాగం కుర్ర ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్‌ది. ఈ ఏడాది భీక‌ర ఫామ్‌లో ఉన్న ఈ యువ‌త‌రంగం 29 సిక్స‌ర్ల‌తో టాప్‌లో కొన‌సాగుతున్నాడు. శుభ్‌మ‌న్ గిల్ 16, రోహిత్ శ‌ర్మ 11 సిక్స‌ర్ల‌తో వ‌రుసగా రెండు మూడో స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 8, ధ్రువ్ జురెల్‌లు 7 సిక్స‌ర్లు బాదారు.