భూమిని కాపాడేవి భారతీయుల ఆహార పద్ధతులే

భూమిని కాపాడేవి భారతీయుల ఆహార పద్ధతులే
భారతీయుల భోజన పద్ధతులు ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది. ఈ పద్దతులను ప్రపంచం అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రమాదాల నుండి భూగోళాన్ని కాపాడవచ్చని స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు) ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార వినియోగం అత్యంత సుస్థిరమైనదని, ప్రపంచ దేశాలన్నీ ఈ  పద్ధతులను అనుసరిస్తే 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తిలో భూ గ్రహానికి అత్యంత తక్కువ నష్టం వాటిల్లుతుందని సూచించింది.

ఆర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఆహార వినియోగ విధానాలు అత్యంత హీనంగా ఉన్నాయని, ఆయా దేశాల పద్ధతులు భూతాపాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించింది. ఆహార వినియోగంలో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాల బాటలో నడిస్తే 2050 నాటికి భూతాపం పరిమితిని మించి పెరిగిపోతుందని తెలిపింది. 

ఆహార సంబంధిత ఉత్పత్తుల కారణంగా 2050 నాటికి వాతావరణం 1.5 డిగ్రీల సెల్షియస్‌ మేరకు పెరగవచ్చన్నది అంచనా. అయితే ప్రస్తుత ఆహార వినియోగ విధానాల కారణంగా అది అంతకన్నా 263 శాతం పెరగవచ్చని, అప్పుడు భూమిమీద ఉన్న వారికి మరో ఏడు భూగ్రహాలు అవసరమవుతాయని వివరించింది.

భారతీయుల భోజన వినియోగ విధానాలను అందరూ అనుసరిస్తే 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తికి ప్రస్తుత భూగ్రహంలో 0.84 శాతం సరిపోతుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ప్రపంచమంతా అర్జెంటీనా ధోరణిని అనుసరిస్తే 2050 నాటికి ఆహార పదార్థాల ఉత్పత్తికి మరో 7.4 భూగహ్రాలు అవసరమవుతాయని తెలిపింది. 

ఆహార పదార్థాల ఉత్పత్తి సుస్థిరతలో అర్జెంటీనా అత్యంత బలహీనమైన విధానాన్ని కలిగి ఉన్నదని, దాని తరువాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, బ్రిటన్‌ దేశాలున్నాయని పేర్కొంది. అత్యుత్తమ ఆహార విధానాలు కలిగి దేశాల్లో భారత్‌ తరువాత ఇండొనేషియా, చైనా, జపాన్‌, సౌదీ అరేబియా ఉన్నాయని వివరించింది.

“ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ 2050 నాటికి ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల  ప్రస్తుత ఆహార వినియోగ విధానాలను అవలంబిస్తే,మనం ఆహార సంబంధిత గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కోసం 1.5 ° సెల్సియస్ వాతావరణ (వేడెక్కుతున్న పరిమితి) లక్ష్యాన్ని 263 శాతానికి అధిగమిస్తాము. దీనికి ఒకటి నుండి ఏడు భూగ్రహాలు అవసరం కాగలవు” అని నివేదిక హెచ్చరించింది.

కాగా, భారత ప్రభుత్వం చేపట్టిన మిల్లెట్‌ మిషన్‌ (జొన్నలు, ఇతర చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం)ను ఆ నివేదిక ప్రశంసించింది. జొన్నలు, చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, సాధారణ భూముల్లో సైతం ఆ పంటలను పండివచ్చని తెలిపింది. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఆ పంటను సాగుచేయవచ్చని పేర్కొంది. 

పప్పు ధాన్యాలు, అత్యధిక పోషక విలువలుండే తృణ ధాన్యాలు, మొక్కల ఆధారంగా ఉత్పత్తి చేసే మాంసం ప్రత్యామ్నాయాలు, పోషకాలు అధికంగా ఉండే నీటిపాచి జాతుల వంటి వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆ నివేదిక సూచించింది.

“కొన్ని దేశాల్లో, సాంప్రదాయ ఆహారాలను ప్రోత్సహించడం అనేది ఆహారాన్ని మార్చడానికి ఒక ముఖ్యమైన మార్గం అవుతుంది. ఉదాహరణకు, భారతదేశ జాతీయ మిల్లెట్ క్యాంపెయిన్ ఈ పురాతన ధాన్యం జాతీయ వినియోగాన్ని పెంచడానికి రూపొందించబడింది. ఇది ఆరోగ్యానికి మంచిది.వాతావరణ మార్పుల నేపథ్యంలో అత్యంత స్థితిస్థాపకంగా ఉంటుంది, “అని నివేదిక పేర్కొంది.

ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని సాధించడం అనేది స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, వ్యక్తిగత ఎంపికలు, అందుబాటులో ఉన్న ఆహారం ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుందని నివేదిక తెలిపింది. “మరింత స్థిరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆహార ఉత్పత్తికి అవసరమైన భూమి పరిమాణం తగ్గుతుంది. ముఖ్యంగా భూమిని ప్రకృతి పునరుద్ధరణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్‌తో సహా ఇతర ప్రయోజనాల కోసం విముక్తి చేయవచ్చు” అని నివేదిక వివరించింది.