50 మంది సీనియర్‌ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా

50 మంది సీనియర్‌ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీకార్‌ మెడికల్‌ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా జూనియర్‌ డాక్టర్లు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వీరి నిరసనలకు ఆర్‌జీకార్‌ ఆసుపత్రిలోని సీనియర్‌ వైద్యులు మద్దతు తెలిపారు. ఈ మేరకు దాదాపు 50 మంది సీనియర్‌ డాక్టర్లు సీనియర్ మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
 
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, దవాఖానలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఆగస్టు 9న వెలుగుచూసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనకు నిరసనగా జూనియర్‌ డాక్టర్లు దాదాపు నెల రోజులు విధులు బహిష్కరించి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇవ్వడంతో ఇటీవల ఆందోళనను విరమించి విధుల్లో చేరారు.

అయితే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని జూనియర్‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం మరోసారి సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్‌ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు. 

డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి 24 గంటల నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే నిరాహార దీక్ష చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్‌ జూనియర్‌ వైద్యుల ఫ్రంట్‌ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులకు మద్దతుగా సీనియర్‌ డాక్టర్లు రాజీనామా చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

మరోవైపు డాక్టర్‌ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 200 మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌గా తేల్చింది.  రాత్రి విరామ సమయంలో దవాఖాన సెమినార్‌ హాల్‌లోకి వెళ్లిన వైద్యురాలిపై సివిక్‌ వలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ రాయ్‌ ఘాతుకానికి పాల్పడ్డాడని సీబీఐ తెలిపింది. గ్యాంగ్‌ రేప్‌ జరిగిందా? లేదా? మరికొంత మంది ప్రమేయం ఇందులో ఉందా? అన్నది తేల్చేందుకు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది.