హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. శుక్రవారం ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హెజ్బొల్లా సీనియర్ నేత హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తున్నది.
నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లాకు సఫీద్దీన్ నాయకత్వం వహించనున్నట్టు భావిస్తున్నారు. కాగా, హెజ్బొల్లా కమ్యూనికేషన్ విభాగం కమాండర్ మహమ్మద్ రషీద్ సకాఫిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. లెబనాన్‌పై తాము జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారని చెప్పింది.
హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ హెచ్చరించారు. ‘హెజ్బొల్లాకు ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేము నస్రల్లాను హతమార్చాం. మా ఆయుధాగారంలో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు జరగనున్నాయి. కొన్ని ఇప్పటికే చేపట్టాం, ఇంకొన్ని చేపట్టాల్సి ఉంది’ అని గలాంట్ తెలిపారు.
మరోవంక, ఇరాన్ మద్దతున్న హౌతీలపై అమెరికా, బ్రిటన్ శుక్రవారం దాడులు చేశాయి. యెమెన్‌లో ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు, ఆయుధ పరికరాలు నిల్వ చేసిన ప్రదేశాలు లక్ష్యంగా వైమానిక, నౌకా దాడులు జరిపినట్టు ఒక అధికారి ధ్రువీకరించారు. కాగా, తమ ప్రధాన పోర్టు సిటీ హొడియాడ ఎయిర్‌పోర్టు, ప్రధాన మిలటరీ బేస్ ఉన్న కతియాబ్ లక్ష్యంగా ఏడు దాడులు జరిగినట్టు హౌతీ తెలిపింది.
ఇజ్రాయిల్- ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై దాడులు జరపమని ఇజ్రాయిల్ దళాలకు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సూచించారు. సంయమనం పాటింపమని ఇజ్రాయిల్ కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సూచించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దేశ అణ్వాయుధ స్థావరాలపై దాడులు జరపకుండా ఆ దేశాన్ని కట్టడి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా
బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో