
ప్రస్తుతం దేశంలో బిహారీ అన్న పదం ఒక తిట్టులా మారిందని, ఆ పరిస్థితి మారాలని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ‘‘’మీరంతా ‘జై బిహార్’ అని గట్టిగా నినదించాలి. ఆ నినాదం మిమ్మల్ని, మీ పిల్లలను ఎవరూ ‘బిహారీ’ అని దూషించకుండా చేయాలి. మీ వాయిస్ ఢిల్లీకి చేరాలి. అది బెంగాల్ కు చేరుకోవాలి. అక్కడ బీహార్ కు చెందిన విద్యార్థులను కొట్టారు. బీహారీ పిల్లలను దూషించిన, కొట్టిన తమిళనాడు, ఢిల్లీ, బొంబాయి ప్రాంతాలకు ఇది చేరాలి’’ అని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు.
బెంగాల్లోని సిలిగురికి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను వేధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే జన్ సురాజ్ పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, బీహార్ కు చెందిన వేలాది మందితో సమావేశామై, బిహార్ బాగోగులపై అధ్యయనం చేశారు.
గత 25-30 ఏళ్లుగాబిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, దాంతో ప్రజలు లాలూ ప్రసాద్ యాదవ్ కు భయపడి బీజేపీకి ఓటు వేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఆ రాజకీయ నిస్సహాయతకు ముగింపు పలకడమే తన పార్టీ ముఖ్య ఉద్దేశమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జన్ సురాజ్ పార్టీ బీహార్ ప్రజలందరి పార్టీగా ఉంటుందని చెబుతున్నారు.
ఇటీవల ఆర్జేడీ కి దూరమై, బీజేపీతో మరోసారి పొత్తుపెట్టుకుని సీఎం అయిన నితీశ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్ నితీశ్ కుమార్ పార్టీ జేడీయూలో ఉన్నారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. లాలూ యాదవ్ కు మద్దతిచ్చినందుకు బిహార్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే నితీశ్ కు మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి పడుతుందని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు.
రాష్ట్ర పాలన నిర్వహించగల మానసిక, శారీరక ఆరోగ్యం ఇప్పుడు నితీశ్ కుమార్ కు లేదన్నారు. ‘‘లాలూప్రసాద్ యాదవ్”బిహార్ లో 15 ఏళ్ల పాటు ‘జంగిల్ రాజ్’ నడపడానికి కాంగ్రెస్ సహకరించింది. దాంతో, బీహార్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తరిమికొట్టారు. బిజెపికి కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. నితీష్ కుమార్ కు మద్దతివ్వడం బీజేపీ రాజకీయ అనివార్యత అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!