ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా

ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా
ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా భారత ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రా నిలిచాడు. ఇప్పటి వరకు నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగిన టీమిండియా స్పిన్నర్‌ను వెనక్కి నెట్టారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మిస్టరీ బౌలర్‌ బుమ్రా నెంబర్‌ స్థానానికి చేరుకున్నాడు. 
 
ఐసీసీ బుధవారం టెస్ట్‌ ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ర్యాకింగ్స్‌లో యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, సీనియర్‌ బాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం ర్యాంకులను మరింత మెరుగుపరుచుకున్నారు.  భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన రెండు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌లో ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా అద్భుత ప్రదర్శనతో 11 కూల్చాడు. రెండోస్థానంలో ఉన్న బుమ్రా 870 పాయింట్లతో నెంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. 
 
అశ్విన్‌ 869 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయాడు. బుమ్రా టెస్ట్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలువడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ అనంతరం నెంబర్‌ అగ్రస్థానానికి చేరాడు. ఆ తర్వాత ర్యాంకు పడిపోయింది. ఇంతకు ముందు ఫాస్ట్‌ బౌలర్లలో టీమిండియా నుంచి కపిల్‌దేవ్‌ ఈ ఘనత సాధించాడు. 
 
కాన్పూర్ టెస్టులో బుమ్రా మొత్తం ఏడు వికెట్లు తీయగా, అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ నాలుగు స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. సీనియర్‌ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 28వ స్థానానికి చేరుకున్నాడు.బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు 792 పాయింట్లు అతని ఖాతాలో ఉన్నాయి. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. 22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ మూడు అర్ధ సెంచరీలను సాధించాడు. 

బ్యాట్స్‌మెన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ 6వ స్థానానికి చేరుకున్నాడు. చెన్నై టెస్టులో 6, 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరిన కోహ్లీ.. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో చోటు దక్కలేదు. 

కాన్పూర్‌ టెస్టులో పునరాగమనం చేసిన విరాట్‌ 47, 29 (నాటౌట్‌) పరుగులు చేసి విజయంలో కీలక పోషించాడు. దాంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్‌కి చేరాడు. ఇక రిషబ్‌ పంత్‌ 9వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ టాప్‌-10లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం 15వ ప్లేస్‌కి చేరాడు.