అమెరికాలో హెలెనా విధ్వంసం.. 44 మంది మృతి

అమెరికాలో హెలెనా విధ్వంసం.. 44 మంది మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో హెలెనా హరికేన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.  . ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంపై ఈ తుపాను అత్యధికంగా ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. 
 
దాదాపు పది కౌంటీల్లో ఈ తుపాను తీవ్రత ఉన్నట్లు వెల్లడించారు. తుపాను ధాటికి ఆయా రాష్ట్రాలను వరద చుట్టుముట్టింది. అతి తీవ్రమైన హెలెనా కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావంతో 20 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. పలు ఆసుపత్రుల్లో కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

ఇక యునికోయ్‌ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్‌ సాయంతో 54 మందిని రక్షించారు. అదేవిధంగా టెనస్సీలోని న్యూపోర్ట్‌ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.  ఫ్లోరిడా లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ శుక్రవారం రాత్రి తీరం దాటింది. 

తీరం దాటే సమయంలో గంటకు 225 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్‌ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హెలీన్ కేటగిరీ 4 హరికేన్ కాగా గతేడాది కూడా బిగ్ బెండ్ దగ్గర కేటగిరీ 3 స్టార్మ్ ఇదాలియా తీరం దాటింది. ఈ తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి. ఈ తుపాను కారణంగా ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.