చైనాను అదుపు చేయడానికి, అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వితం చేసేందుకు క్వాడ్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని చైనా విమర్శించింది. ఈ ప్రాంతానికి వెలుపల ఉన్న కొన్ని దేశాలు ప్రత్యేక సర్కిల్స్‌గా ఏర్పడి చైనా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంత జలాల్లో తమ సార్వభౌమాధికారాన్ని, సముద్ర జలాల హక్కులను పరిరక్షించుకోవాలన్న కృత నిశ్చయాన్ని ఈ విదేశీ శక్తుల జోక్యం ఏ రకంగానూ దెబ్బతీయలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వంత పట్టణమైన విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సు ముగిసిన రెండు రోజుల తర్వాత చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సముద్రజలాలపై ఆందోళనలు అన్న ముసుగులో మిలటరీ మద్దతును కూడగట్టుకోవడానికి, భద్రతా సహకారాన్ని పెంచుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని, అందుకే క్వాడ్ సదస్సును నిర్వహించిందని ఆయన విమర్శించారు. వాషింగ్టన్ గుత్తాధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి క్వాడ్‌ను ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
నేరుగా చైనా పేరును ప్రస్తావించకుండా తూర్పు, దక్షిణ చైనా సముద్ర జలాల్లో పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ క్వాడ్ సంయుక్త ప్రకటన వెలువరించింది. గతేడాది కన్నా పరుషమైన భాషను ఈసారి ఉపయోగించారు. అక్కడ పరిస్థితి సుస్థిరంగా వుందని లిన్ స్పష్టం చేశారు. ఆ ప్రాంతానికి వెలుపల వుండే కొన్ని దేశాలు చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎంతలా జోక్యం చేసుకున్నా, రెచ్చగొట్టినా చైనా నిబద్ధతను, దీక్షను, కృత నిశ్చయాన్ని సడలించలేరని స్పష్టం చేశారు.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు