అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార జోరు పెంచారు. అయితే, ఈ ఎన్నికల వేళ అభ్యర్థులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు దాడి జరగ్గా.. తాజాగా కమలా హారిస్ ను దుండగులు టార్గెట్ చేశారు. కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై తుపాకులతో దాడి చేశారు.
అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అరిజోనా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.
కాగా, ఇటీవలే డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది.
గత నెల 30న పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్ లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 15న కూడా ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇలా ఉండగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. ఆసియన్ అమెరికన్ ఓటర్లలో 38 పాయింట్లతో కమలా హారిస్ ముందజలో ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.
ఆ పోల్ ప్రకారం, ఆసియా అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది హారిస్‌కు మద్దతుగా ఉండగా, కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన సర్వేలో 46 శాతం బైడెన్‌కు మద్దతు పలకగా, 31 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన