శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ఓటమి పాలు కాగా, అనుర కుమార దిసనాయకే విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న దినేష్ గుణవర్ధన సోమవారం రాజీనామా చేయగా కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య పేరును ప్రకటించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆమె ప్రమాణం చేశారు.

శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్యతో కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. 54 ఏళ్ల హరిణి అమరసూర్య  నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందినవారు కాగా గత 24 ఏళ్లలో ప్రధాని పీఠంపై కూర్చున్న తొలి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. చివరిగా 1994 నుంచి 2000 వరకు శ్రీలంక మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే పనిచేశారు. ఆమె తర్వాత ఇన్నేళ్లకు ఒక మహిళగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు.

హరిణి అమరసూర్యతో పాటు మరో ఇద్దరు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో శ్రీలంకలో అధ్యక్షుడు అమర కుమార దిసనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్యతో పాటు మొత్తం నలుగురితో కూడిన మంత్రివర్గం కొలువుదీరింది. 

ఇక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణి అమరసూర్యకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించారు. నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్‌ నిపుణరచిచి కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందిన హరిణి అమరసూర్య  శ్రీలంక 16వ ప్రధానమంత్రి కాగా, ఆ దేశ చరిత్రలోనే మూడో మహిళా ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ క్రమంలోనే ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని అనుర కుమార దిసనాయకే సోమవారం ప్రకటించారు. దీంతో శ్రీలంకలో నవంబర్‌లో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మార్క్సిస్టు నాయకుడు అనురా కుమార దిసనాయకే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘రాజకీయ నాయకులపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి నా వంతు కృషి చేస్తాను’ అని మీడియాతో పేర్కొన్నారు. 

‘శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యల సంక్లిష్టతను అర్థం చేసుకున్నానని, ప్రజల ఆశలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తానని, ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తానని, అందుకు మీ అందరి మద్దతు కావాలి’ అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేను మాంత్రికుడిని, మంత్రగాడిని కాదు. నాకు తెలిసినవి వున్నాయి, తెలియనివీ వున్నాయి. అయితే నేను ఉత్తమమైన సలహాను కోరుతూ నా వంతు కృషి చేస్తాను. అందుకు మీ మద్దతు కావాలి’ అని ఆయన కోరారు.