
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వివాదం ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు దేవాలయాల ప్రసాదాలు, అందులో వాడే నెయ్యి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా, తెలంగాణలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేయనున్నట్టు తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు.
ఇక నుంచి విజయ డెయిరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, ఆస్పత్రులకు అవసరమైన పాలు, పాల పదార్థాలను సరఫరా చేయనున్నట్టు అమిత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు.. పెండింగ్ పాల బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని గుత్తా అమిత్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6148 పాల సేకరణ కేంద్రాల ద్వారా రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని విజయ డెయిరీ సహా ఇతర డెయిరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నట్టు గుత్తా అమిత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా మూడు పర్యయాలుగా 12 రూపాయలకు పైగానే పెంచినట్టు గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పాల సేకరణ రేటు పెంచినట్టుగా అమిత్ రెడ్డి తెలిపారు.
అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో తెలంగాణపై ఆ ప్రభావం పడుతోందని వివరించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను కేవలం 26 నుంచి 34 రూపాయలకే కొని, రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అమిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
దీని వల్ల.. తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ గణనీయంగా తగ్గుతోందని పేర్కొననారు. అందుకే.. పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందన్న అమిత్ రెడ్డి.. బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
More Stories
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం