
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విశేషంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాకు చెందిన ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనుబంధ నెట్ ఫ్లిక్స్ ఇండియా సంస్థ నియంత్రణ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి వీసా నిబంధనల ఉల్లంఘన, జాతి వివక్ష వంటి చర్యలకు పాల్పడుతున్నదని వచ్చిన ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
దేశీయంగా నెట్ ఫ్లిక్స్ వ్యాపార పద్దతులపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగికి పంపిన ఈ మెయిల్ లో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు సమాచారం. 2020లోనే నెట్ ఫ్లిక్స్ ఇండియా బిజినెస్ అండ్ లీగల్ అఫైర్స్ డైరెక్టర్‌గా తప్పుకున్న నందినీ మెహతాకు కేంద్ర హోంశాఖ అధికారి రాసిన లేఖతో నెట్ ఫ్లిక్స్ భారత్ ఆపరేషన్స్ మీద దర్యాప్తు చేస్తున్నట్లు అర్థమైంది.
ఈ మేరకు గత జూలై 20న నందినీ మెహతాకు కేంద్ర హోంశాఖ అధికారి పంపిన మెయిల్ కూడా బయటకు వచ్చింది. వీసా నిబంధనల తోపాటు పన్ను నిబంధనలనూ నెట్ ఫ్లిక్స్ ఉల్లంఘిస్తోందని హోంశాఖ ఆధీనంలోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారి దీపక్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.‘భారత్‌లో వ్యాపార నిర్వహణలో కంపెనీ ప్రవర్తనా నియమావళి, వీసా నిబంధనల ఉల్లంఘన, చట్ట విరుద్ధ నిర్మాణాలు, పన్ను ఎగవేత, జాతి వివక్ష వంటి చర్యలకు నెట్ ఫ్లిక్స్ పాల్పడుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. దీనిపై విచారణ చేపట్టాం’ అని దీపక్ యాదవ్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని నందినీ మెహతా స్వాగతించారు. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. తన పట్ల జాతి, లింగ వివక్షకు పాల్పడుతూ తప్పుగా తనను తొలగించారని నందినీ మెహతా ఆరోపించారు. ఈ విషయమై నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంపై కేసు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, నందినీ మెహతా ఆరోపణలను నెట్ ఫ్లిక్స్ నిరాకరించింది.
ఇక నందినీ మెహతాకు లేఖ రాసిన సంగతిపై స్పందించేందుకు దీపక్ యాదవ్ నిరాకరించారు. తనకు దీనిపై స్పందించే అధికారం లేదన్నారు. తమపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిన విషయమై సమాచారం లేదని నెట్ ఫ్లిక్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ