
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉదయం జూనియర్ వైద్యులు పాక్షికంగా తమ విధుల్లోకి చేరారు. అయితే అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరయ్యారు. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో విధులకు మాత్రం దూరంగా ఉన్నారు. ‘మేము ఇవాళ పాక్షికంగా మా విధుల్లోకి చేరాం. మా సహోద్యోగులు ఈ ఉదయం నుంచి అత్యవసర సేవల్లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు’ అని ఓ వైద్యుడు తెలిపారు. హత్యాచార ఘటనపై తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాగా, వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ 40 రోజులుకుపైగా కోల్‌కతా వైద్యులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైద్యుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది.
ఈ క్రమంలో రెండు దఫాలుగా వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలో వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం మతమతా బెనర్జీ అంగీకారం తెలిపారు. ఇందులో భాగంగానే కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌గా వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు.
అదేవిధఃగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లపై కూడా వేటు వేశారు. ఆ తర్వాత రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్‌తో వైద్యులు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆందోళన విరమిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. పాక్షికంగా సమ్మెను విరమిస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు.
ఇక జూనియర్ డాక్టరు ఆందోళన విరమించే ముందు సీజీఓ కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు గౌరి రాయ్.. జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి 42 గులాబీలున్న పుష్పగుచ్చాన్ని వారికి అందజేశారు. మరోవైపు వైద్యురాలికి న్యాయం జరగాలంటూ శుక్రవారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో 42 కిలో మీటర్ల మేర భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది పౌరులు తమ సంఘీభావం తెలుపుతూ.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం