
ల్యాబ్ ఆధారిత వజ్రాల తయారీ పరిశ్రమ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో సహజసిద్ధమైన సానబెట్టని ముడి వజ్రాల నిల్వలు సంప్రదాయ పరిశ్రమల్లో భారీగా పేరుకుపోతున్నాయని, ఆర్డర్లు కూడా వీటికి తగ్గిపోయాయని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అంటున్నారు. ఫలితంగా ఫ్యాక్టరీలు మూతబడి, ఉద్యోగులు రోడ్డునపడే దుస్థితి నెలకొందని చెప్పారు.
భారతీయ డైమండ్ హబ్‌గా పేరొందిన ఒక్క గుజరాత్‌లోనే ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఇండస్ట్రీకి చెందిన 60 మందికి పైగా బలవన్మరణం పొందినట్టు గుర్తుచేశారు. ఇదిప్పుడు దేశీయ వజ్రాల పరిశ్రమ సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు. తక్షణమే ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారించాలని, అప్పుడే ఈ రంగానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
2021-22లో దేశంలోకి ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్ల మేర జరిగాయి. కానీ 2023-24లో ఇవి 14 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అలాగే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి వజ్రాలను ఆయా దేశాలు భారత్‌కు ప్రాసెసింగ్ కోసం తిరిగి ఎగుమతి చేస్తుంటాయి.
ఉదాహరణకు బోట్స్‌వానా, అంగోలా, దక్షిణాఫ్రికా, రష్యాల నుంచి దుబాయ్ ముడి వజ్రాలను దిగుమతి చేసుకుంటున్నది. వాటిని మళ్లీ భారత్‌కు రీ-ఎక్స్‌పోర్ట్ చేస్తున్నది. ఇలా వస్తున్న వాటి విలువ కూడా 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించింది. మార్కెట్‌లో పడిపోయిన వ్యాపార లావాదేవీలకు, డైమండ్ ప్రాసెసింగ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.
ఇక సానబెట్టిన, పాలీష్డ్ వజ్రాల ఎగుమతి 2021-22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2023-24లో 13.1 బిలియన్ డాలర్లే. కేవలం రెండేండ్లలో 34.6 శాతం పతనం కనిపించింది. అంతేగాక ఈ వ్యవధిలో విదేశాల్లో అమ్ముడుపోక భారత్‌కు తిరిగొచ్చే వజ్రాల వాటా కూడా 35 శాతం నుంచి 45.6 శాతానికి ఎగిసింది.
అమెరికా, చైనా, ఐరోపా దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా భారతీయ వజ్రాల పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీశాయని ఈ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాలీష్డ్ డైమండ్స్‌కు ఇక్కడ గిరాకీ బాగా తగ్గిందని చెప్తున్నారు. వజ్రాలుసహా ఇతర లగ్జరీ ఉత్పత్తుల కొనుగోళ్లకూ ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదని అంటున్నారు. ముఖ్యంగా ల్యాబ్ (ప్రయోగశాల)ల్లో తయారవుతున్న కృత్రిమ వజ్రాలు తక్కువ ధరకే లభిస్తుండటం కూడా సహజమైన వజ్రాలకు డిమాండ్‌ను తగ్గిస్తున్నది.
More Stories
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ఊర్వశి, మిమి చక్రవర్తిలకు నోటీసులు
ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా జీఎస్టీ ప్రభావం