అశ్రునయనాల మధ్య సీతారాం ఏచూరి అంతిమయాత్ర

అశ్రునయనాల మధ్య సీతారాం ఏచూరి అంతిమయాత్ర
వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకపు అశ్రునయనాల మధ్య సీతారాం ఏచూరి అంతిమయాత్ర శనివారం సాగింది. గోల్‌ మార్కెట్‌లోని సిపిఎం కార్యాలయం నుండి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. గురుద్వార్‌, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం, డాక్‌ భవన్‌, పటేల్‌ చౌక్‌ మెట్రోస్టేషన్‌ మీదుగా జంతర్‌ మంతర్‌ రోడ్డు వరకు సాగింది. 
 
దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతిమ యాత్రలో ముందు భాగాన రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ఏచూరి చిత్ర పటాలు, సిపిఎం జెండాలు చేబూని నినాదాలు చేస్తూ భాగస్వాములయ్యారు. వారి తరువాత ఏచూరి భౌతిక కాయంతో అంబులెన్స్‌ కదిలింది. అంబులెన్స్‌ వెనుక సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, మాణిక్‌ సర్కార్‌, బృందాకరత్‌, బివి రాఘవులు, అశోక్‌ దావలే, .జి రామకృష్ణన్‌, ఎంఎ బేబి, విజయరాఘవన్‌, ఎంవి గోవిందన్‌ మాస్టార్‌ తదితరులు నడిచారు. 
 
కేంద్ర కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు అంతిమయాత్రలో భాగస్వాములయ్యారు. యాత్ర సాగిన దారిపొడవునా ఉన్న ప్రజలు ఏచూరికి లాల్‌సలాం చెబుతూ నినాదాలు చేశారు.  అంతకు ముందు, లాల్‌ సలామ్‌ నినాదాల మధ్య ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్‌కు తీసుకొచ్చారు. 
 
సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్‌, బృందా కారత్‌, పినరయి విజయన్‌, ఎంఏ బేబీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఎన్‌సీపీ (ఎస్‌పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్‌, టీఆర్‌ బాలు; సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, వివిధ దేశాల రాయబారులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగించారు.
కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఏచూరి ఏయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆయన తుదిశ్వాస విడిచారు. అదే ఆస్పత్రికి భావి తరాల వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఆయన భౌతిక కాయం చేరకుంది.