అదానీ విద్యుత్‌ ఒప్పందాన్ని పరిశీలిస్తాం

అదానీ విద్యుత్‌ ఒప్పందాన్ని పరిశీలిస్తాం
భారత పారిశ్రామికవేత్త అదానీకి చెందిన విద్యుత్‌ ఒప్పందాన్ని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పరిశీలించనున్నది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఇతర వ్యాపారాలూ ఉన్నాయని తాత్కాలిక ప్రభుత్వంలోని కీలక నాయకుడొకరు చెప్పారు. షేక్‌ హసీనా ప్రభుత్వంలో 2017లో అదానీ గ్రూపుతో ఒప్పందం జరిగింది. 
 
దీని ప్రకారం తన జార్ఖండ్‌ యూనిట్‌ నుంచి అదానీ గ్రూపు బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం రద్దవటం, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం విదితమే. దీంతో షేక్‌ హసీనా నేతృత్వంలో జరిగిన వ్యాపార ఒప్పందాలపై అక్కడి ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. 

అసలు అదానీ గ్రూపుతో జరిగిన ఒప్పందంలోని నిబంధనలేంటి అని తెలుసుకోవటంపై బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం చాలా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తున్నది. విద్యుత్‌ కోసం జరిపే చెల్లింపులు సమర్థనీయమేనా? అన్నదాని పైనా దృష్టి సారించింది. 
 
”ఎలాంటి కాంట్రాక్టులపై సంతకాలు జరిగాయి? నిబంధనలు, షరతులు ఏమిటి? అనే విషయంలో అదానీ బిజినెస్‌ వంటి భారత వ్యాపారాలపై పరిశీలన ఉంటుంది. దేశ చట్టాన్ని అనుసరించని విదేశీ కంపెనీ ఉండకూడదు. అయితే, భారత వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోవడం వంటిదేమీ లేదని, వ్యాపారాల గురించే పరిశీలన ఉంటుంది. బంగ్లాదేశ్‌ ఎంత చెల్లిస్తుంది, అది సరియైనదేనా అనే ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి” అని తాత్కాలిక ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ నాయకుడు తెలిపాడు.
 
భారత్‌తో తాము మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని ఢాకా అంటున్నది. ”భారత్‌తో మేము స్థిరమైన, తటస్థ సంబంధాలను కావాలనుకుంటున్నాం. కానీ, షేక్‌ హసీనాకు ఆశ్రయమివ్వటమే సమస్య. తొలుత ఆమె అక్కడ (భారత్‌) కొంతకాలమే ఉంటారనుకున్నాం. కానీ, బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలను సాగించటానికి ఆమెకు అక్కడ చోటు దక్కుతున్నది” అని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా వ్యాఖ్యలను ఉటంకిస్తూ సదరు సీనియర్‌ నాయకుడు తెలిపారు.
 
దేశ ఆర్థిక పరిస్థితిపై యూనస్‌ దృష్టి సారిస్తున్నారని చెప్పారు. దేశంలో యంత్రాంగాన్ని, ఆర్థిక పరిస్థితులను షేక్‌ హసీనా భ్రష్టు పట్టించారనీ, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని సదరు నేత ఆరోపించారు. ప్యూన్‌ స్థాయి వ్యక్తులు కూడా కోట్ల టకా(బంగ్లాదేశ్‌ కరెన్సీ)లను పోగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.